10-10-2025 01:07:50 AM
పటాన్ చెరు, అక్టోబర్ 9 : ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచడం పేద, మధ్యతరగతి కుటుంబాలను ఇబ్బందులకు గురి చేయడమేనని బీఆర్‌ఎస్ నాయకుడు, ఎండీఆర్ ఫౌండేషన్ చైర్మన్ మాదిరి పృథ్వీరాజ్ తెలిపారు. బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన చలో బస్ భవన్ కార్యక్రమంలో మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు తో కలిసి ఆయన మెహిదీపట్నం నుండి బస్ భవన్ వరకు బస్లో ప్రయాణించి, సాధారణ ప్రయాణికులతో మమేకమై వారి సమస్యలను తెలుసుకున్నారు.
ప్రయాణికుల సమస్యలను వివరంగా విన్న అనంతరం అడ్డగోలుగా పెంచిన ఆర్టీసీ బస్ చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ పేద, మధ్యతరగతి ప్రజల తరపున బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు కలిసి టీఎస్‌ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి కి వినతిపత్రం సమర్పించారు.