22-05-2025 04:35:13 PM
విలేకరుల సమావేశంలో ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ల డిమాండ్..
మంథని (విజయక్రాంతి): తమ న్యాయమైన డిమాండ్లను అద్దె బస్సు యజమానులు సత్వరమే పరిష్కరించాలని అద్దె బస్సు డ్రైవర్లు డిమాండ్ చేశారు. గురువారం మంథని డివిజన్ మీడియా ప్రెస్ క్లబ్(Manthani Division Media Press Club) లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా అద్దె బస్సు డ్రైవర్ల యూనియన్ అధ్యక్షులు కేతిరి మహేష్ మాట్లాడుతూ... తమ ఒప్పందం ప్రకారం ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి వేతనాలు పెంచాల్సి ఉండగా యాజమాన్యం ఇప్పటి వరకు ఆ నిబంధనను పట్టించుకోలేదని వాపోయారు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు మూడుసార్లు అద్దె బస్సు ఓనర్లకు నోటీసులు ఇవ్వడం జరిగిందని తెలిపారు.
అద్దె బస్సు ఓనర్లు చర్చలకు వచ్చి తమ న్యాయమైన డిమాండ్లను ఒప్పుకోకపోవడంతో తప్పనిసరి పరిస్థితిలో సమ్మెకు దిగాల్సి వచ్చిందన్నారు. అనివార్యంగా ఈనెల 19 నుంచి సమ్మెను కొనసాగిస్తున్నామని, నిరవధిక సమ్మె కొనసాగుతూ నాలుగవ రోజుకు చేరినా అద్దె బస్సు యజమానులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఆర్టీసీ నిబంధనల ప్రకారం పూర్తిస్థాయి అర్హత కలిగి కరీంనగర్ లో ఏడు రోజులు, వరంగల్ లో ఏడు రోజులు శిక్షణ పొంది ఉన్నామని, సమ్మె సమయంలో తాత్కాలిక అర్హత లేని డ్రైవర్లను నియమించుకుని బస్సులు తిప్పుతున్నారని అవేదన వ్యక్తం చేశారు. అర్హత లేని డ్రైవర్ల వల్ల ప్రజలకు, ప్రయాణికులకు హాని కలిగే అవకాశం ఉందని గుర్తు చేశారు.
తమకు ఎక్స్ ప్రెస్ కరీంనగర్ ఆర్డినరీ నైట్ అవుట్ రూ. 25000, బిహెచ్పిఎల్, పెద్దపల్లి, ఓడేడు, ఆరెంద రూ. 24000, రెండు డ్రెస్సులు, ఒక డ్రైవర్ కి సంవత్సరానికి ఒక జీతం పూర్తిగా ఇవ్వడం, బస్ పాస్ కనీసం 100 కిలోమీటర్ల వరకు ప్రతి డ్రైవర్ కి ఇవ్వడం, ప్రతి నెల జీతం 5 తేదీ లోపు ఇవ్వాలన్నారు. అదేవిధంగా ఏదైనా అనుకోని కారణాలవల్ల యాక్సిడెంట్ కానీ రోడ్డు మీద ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే దాని పూర్తి బాధ్యత ఓనరు భరించాలని కోరారు. ఏదైనా కారణం చేత డ్రైవర్ని విధుల నుండి తొలగించాలి అనుకుంటే 15 రోజుల ముందు డ్రైవర్ కి సమాచారం అందించాలన్నారు. ఏదైనా బస్సు సర్వీసింగ్ కు, మరమ్మతుకు తీసుకువెళ్లిన డ్రైవర్ కు ఆరోజు పూర్తి జీతం, తిండి ఖర్చులు ఓనరే భరించాలని, ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ల యూనియన్ గౌరవ అధ్యక్షులు ఆకుల కిరణ్ మాట్లాడుతూ గతంలో ఓనర్లకు డ్రైవర్లకు మధ్య ఎన్నోసార్లు సానుకూల వాతావరణంలో ఒప్పందాలు కుదిరించామని అన్నారు.
ఈసారి మాత్రం కొందరు ఓనర్లు మధ్యవర్తులను కించపరిచే విధంగా వ్యవహరించడం బాధాకరంగా ఉందని, మంథని కి చెందిన అద్దె బస్సు ఓనర్లు డ్రైవర్ల డిమాండ్లకు సానుకూలంగా స్పందించినా బయట నుంచి వచ్చిన అద్దె బస్సు ఓనర్లు సానుకూలంగా స్పందించడం లేదని వారి వల్లనే చర్చలు విఫలమయ్యాయని ఆరోపించారు. బయట నుంచి వచ్చిన బస్సుల ఓనర్ల ప్రవర్తన దురుసుగా మాట్లాడడం చర్చలకు గండి కొట్టిందన్నారు. తమ సమస్యలు సత్వర పరిష్కారం కొరకు ఏదైనా ఉత్సవాలు పుష్కరాలు ఉన్నప్పుడు డ్రైవర్లు సమ్మె నోటీసులు ఇస్తారని ఆ సమయం రాకముందే చర్చలు జరిపి డిమాండ్ల ఒప్పందం జరుగుతుందని అన్నారు.
కాలేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాల కంటే 5 నెలల ముందే డ్రైవర్లు తమ డిమాండ్ నెరవేర్చాలని బస్సు యజమానులతో మాట్లాడినా చర్చలకు ముందుకు రాకపోవడం శోచనీయమని అన్నారు. అద్దె బస్సు ఓనర్లు తమ మొండి వైఖరి విడనాడి బేషరతుగా చర్చలకు రావాలని ఆకుల కిరణ్ డిమాండ్ చేశారు. ఆర్టీసీ యాజమాన్యం సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ఆర్టీసీ యాజమాన్యం, అద్దె బస్సు ఓనర్లు చొరవ తీసుకొని చర్చలకు ముందుకు వచ్చి డ్రైవర్ ల న్యాయమైన కోరికలను పరిష్కరించాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో ప్రధాన కార్యదర్శి కె. సతీష్, కోశాధికారి ఎండి. అప్సర్, ఉపాధ్యక్షులు వి. శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి ఎన్ .సాగర్ ఆర్గనైజర్స్ బి.రాకేష్,డి. శ్రావణ్ ముఖ్య సలహాదారులు ఎండి. నయీం,పి.రాజయ్య ఐ. రవి ఎస్ కే. షకీల్,ఏ. కోటేశ్వర్ కార్యవర్గ సభ్యులు జె.శ్రీనివాస్, ఎం. సాగర్, పి. బాపు, ఏ. శ్రీకాంత్, ఏ. నరేష్ ఇతర డ్రైవర్లు పాల్గొన్నారు.