16-08-2025 12:00:00 AM
పటాన్ చెరు, ఆగస్టు 15 : పొల్యూషన్ ఫ్రీ పటాన్ చెరు కోసం శుక్రవారం నియోజకవర్గ కేంద్రమైన పటాన్ చెరులో 2కే రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. బీఆర్‌ఎస్ యువనేత మాదిరి పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. పరిశ్రమల ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్చంద సంస్థల సభ్యులు, మహిళలు, విద్యార్థులతో పాటు పటాన్ చెరు, బీరంగూడ, రుద్రారం, మత్తంగి తదితర ప్రాంతాల నుంచి యువకులు స్వచ్చందంగా 2కే రన్ లో పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణ కోసం నిర్వహించిన ఈ 2కే రన్ లో అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ పటాన్ చెరు ప్రాంతంలో పరిశ్రమల వాయు కాలుష్యంతో పాటు వాహన కాలుష్యం రోజు రోజుకు పెరుగుతోందని, ఇది ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు.
ఈ సమస్యపై ప్రజల్లో అవగాహన పెంచి పర్యావరణాన్ని కాపాడుకునేందుకే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని చెప్పారు. ప్రతి ఒక్కరు పర్యావరణ పరిరక్షణ కోసం తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గూడెం మధుసూదన్ రెడ్డి, అశోక్, పోచారం కృష్ణ, ఆంజనేయులు, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి దృవీకరణ పత్రాలు, మొక్కలను పంపిణీ చేశారు.