30-09-2025 12:00:00 AM
కామారెడ్డి, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి) : కామారెడ్డి జిల్లాలో సోమవారం సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వీక్లీ మార్కెట్, పాత సాయిబాబా ఆలయం, విద్యానగర్లోని శివాలయం, ధర్మశాల, కిష్టమ్మ గుడి ఆవరణలో, కాళికాదేవి ఆలయ ఆవరణలో, పాంచ్రస్తాలో మహిళలు బతుకమ్మలను పెట్టి ఆటలు, ఆడుతూ పాటలు పాడారు.
తీరు ఒక్క పువ్వుని పెట్టి మహిళలు పేర్చిన సద్దుల బతుకమ్మ చుట్టూ చేరి పాటలతో అలరించారు. జిల్లావ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో గ్రామాల్లో సైతం సద్దుల బతుకమ్మ ఆటలను మహిళలు పాడారు. స్థానికంగా ఉన్న చెరువులు, కుంటల్లో సద్దుల బతుకమ్మను నిమజ్జనం చేసి సద్దులను తీసుకెళ్లి భోజనాలు చేశారు. మళ్లీ రా గౌరమ్మ మా ఇంటికంటూ మహిళలు బతుకమ్మలను నిమజ్జనం చేశారు.
సారంగాపూర్‌లో...
నిజామాబాద్ సెప్టెంబర్ 29 (విజయక్రాంతి) : సారంగాపూర్ గ్రామంలో సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. సద్దుల బతుకమ్మ ఆటపాటల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మహిళలు గ్రామంలోని ముద్దుల బతుకమ్మలన్నీ సోమవారం రోజు సాయంకాలం బతుకమ్మ లతోపాటు డప్పు వాయిద్యాలతో వాడవాడ నుండి గ్రామంలోని శ్రీ అభయ ఆంజనేయస్వామి దేవాలయంలో లోకి చేరుకుంది.
ఈ ఊరేగింపులో తెచ్చిన బతుకమ్మలన్నిటిని ఒకచోట పెట్టి పెద్ద తున బతుకమ్మను కొనియాడుతూ మహిళలు తమ చప్పట్లతో సాంప్రదాయ బతుకమ్మ పాటలతో సంబరాలు జరుపుకొన్నారు. బతుకమ్మ పూజ తర్వాత అక్కడ నుండి సారంగాపూర్ గవర్నమెంట్ స్కూల్లో పెద్ద ఎత్తున గ్రామ మహిళలు పిల్లలు కలిసి బతుకమ్మ సంబరాలు జరుపుకొని నిజాంసాగర్ కెనాల్‌లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. అనంతరం మహిళలు పసుపు కుంకుమలతో వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. గౌరమ్మకు ప్రతిరూపమైన బతుకమ్మ పూజ అనంతరం పిల్లలు తమ వెంట తెచ్చిన సభ్యుల ప్రసాదాలు అందరికీ పంచి పెట్టారు.
తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పేది బతుకమ్మ పండుగ
రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి
బాన్సువాడ, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి) : తెలంగాణ సంస్కృతి నీ చాటి చెప్పేది బతుకమ్మ పండుగ అని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం సద్దుల బతుకమ్మ సందర్భంగా స్వగ్రామమైన పోచారంలో కుటుంబ సభ్యులతో కలిసి సతి సమేతంగా బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్నారు.
బాన్సువాడ పట్టణంతో పాటు మండలంలోని పోచారం,దేశాయ్ పేట్, పాత బాన్సువాడ చావిడి వద్ద, బాన్సువాడ పట్టణంలోని రామాలయం దగ్గర, శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయం వద్ద జరిగిన సద్దుల బతుకమ్మ పండుగ సంబరాలలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు , మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి సతీమణి పోచారం సోని రెడ్డి పాల్గొన్నారు. ఈ బతుకమ్మ సంబరాలలో బాన్సువాడ మండలం, బాన్సువాడ పట్టణ నాయకులు, ప్రజాప్రతినిధులు, పెద్ద ఎత్తున మహిళలు, ఆడపడుచులు పాల్గొన్నారు.
తాడ్వాయిలో..
తాడ్వాయి, సెప్టెంబర్, 29 (విజయక్రాంతి) : కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో సోమవారం బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. తాడువాయి మండల కేంద్రంలో, ఎర్ర పహాడ్, నందివాడ, దే మీకలాన్,చిట్యాల, కృష్ణాజివాడి, బ్రాహ్మణపల్లి గ్రామాల్లో బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు మహిళలు నూతన వస్త్రాలు ధరించి బతుకమ్మలను అత్యంత భక్తిశ్రద్ధలతో పేర్చి గ్రామాల్లోని కూడల్ల వద్దకు తీసుకువచ్చారు.
గ్రామాల్లోని కూడళ్ల వద్ద బతుకమ్మలను ఉంచి బతుకమ్మ పాటలు పాడుతూ మహిళలు సంబరాలు జరుపుకున్నారు. అనంతరం బతుకమ్మలను సమీప చెరువులలోకి తీసుకువెళ్లి చెరువుల్లో బతుకమ్మలను వేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తాము తీసుకువెళ్లిన సద్దులను అక్కడే ఆరగించి వచ్చారు. ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగ వేడుకలను మండలంలో అత్యంత వైభవంగా జరుపుకుంటారు.
మద్నూర్‌లో..
మద్నూర్, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి) : కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం పెద్ద ఎక్లారా గ్రామం లో సోమవారం నాడు నిర్వహించిన బతుకమ్మ వేడుకలలో మద్నూర్ సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్ పాల్గొన్నారు.గ్రామం లోని అందరు వివిధ రకాల పూలతో బతుకమ్మలను పేర్చి బతుకమ్మ పాటలతో సాంప్రదాయ బద్ధమైన నృత్యాలు, బతుకమ్మ ఆటలు ఆడారు.
ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో..
ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి) : ఒక్కేసి పువ్వేసి చందమామ పున్నమ్మా పున్నమ్మా బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ& భక్తిశ్రద్ధలతో మహిళల పాటలు ఆటలతో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలో సోమవారం మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి అంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. పట్టణంలోని అన్ని వార్డులలోని ప్రధాన వీధుల్లో మహిళలు బతుకమ్మ పాటలతో ఆటలతో అలరించారు. మహిళలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మున్సిపల్ కమిషనర్ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది చర్యలు చేపట్టారు.
ఎల్లారెడ్డి మండలంలో..
ఎల్లారెడ్డి మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం సద్దుల బతుకమ్మ వేడుకలు జరుగాయి. కళ్యాణి, వెళ్ళుట్ల, తిమ్మారెడ్డి, అన్నాసాగర్, అజామాబాద్, బిక్కనూర్, శివ్వాపూర్, అడవిలింగాల్, లక్ష్మపూర్, రుద్రారం, జంగమయ్యపల్లి, తిమ్మాపూర్, బ్రాహ్మణపల్లి, మల్కాపూర్, శివ్వానగర్, మాచాపూర్, మల్లయ్యపల్లి సాతెల్లి, సోమార్పేట్, మౌలాన్ ఖేడ్ తో పాటు మిగతా గ్రామాల్లో వైభవంగా నిర్వహించారు.
గ్రామాల్లోని కూడళ్లలో బతుకమ్మలను ఉంచి మహిళలు ఆడిపాడారు. అనంతరం గ్రామాల్లోని పొలిమేరలలో ఉన్న బతుకమ్మను నిమజ్జనం చేశారు. వాయినాలు పంచుకొని సల్లంగా చూడు బతుకమ్మ అంటూ ఇంటికి వెనుదిరిగారు. ఎస్‌ఐ మహేష్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు చేపట్టారు. జిల్లాలో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి.