calender_icon.png 24 October, 2025 | 1:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏకాగ్రతకు యోగా, ధ్యానం అవశ్యం

22-10-2025 04:22:04 PM

క్లాసికల్ హఠ యోగా గురువు శ్రీకాంత్ ఉద్బోధ

పటాన్ చెరు: మెరుగైన ఏకాగ్రత, అంతర్గత సామరస్యం కోసం విద్యార్థులు, అధ్యాపకుల దైనందిన జీవితంలో యోగా, ధ్యానాన్ని అనుసంధానించడం అవసరమని ఐఐటీ మద్రాసు పూర్వ విద్యార్థి, క్లాసికల్ హఠయోగా గురువు శ్రీకాంత్ అన్నారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని స్టూడెంట్ లైఫ్ సహకారంతో సాధన యోగా, ధ్యానం పరిచయ కార్యక్రమాన్ని బుధవారం రెండు సెషన్లుగా యోగా, ధ్యాన సంఘం నిర్వహించింది.

సద్గురు జగ్గీ వాసుదేవ్ మార్గదర్శక వీడియో సూచనల మద్దతుతో సద్గురు గురుకులం వద్ద శిక్షణ పొందిన శ్రీకాంత్ ఈ కార్యక్రమాన్ని మధ్యాహ్నం 12.00 నుంచి 1.00 గంట వరకు, సాయంత్రం 3.00 నుంచి 4.00 గంటల వరకు రెండు సెషన్లుగా జరిపారు. వ్యక్తిగత శ్రేయస్సు, వృత్తిపరమైన ప్రభావాన్ని పెంచడానికి యోగా, ధ్యానాన్ని శక్తివంతమైన అభ్యాసాలుగా పరిచయం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

యోగా అనేది మనస్సు, శరీరం, శ్వాస ఏకం కావడానికి, అనుభవపూర్వంగా రావడానికి ఒక మార్గంగా శ్రీకాంత్ అభివర్ణించారు. యోగాలో సమతుల్యత మొదటి అడుగన్నారు. శ్వాస, మనస్సు మధ్య లోతైన సంబంధాన్ని ఎలుగెత్తి చాటారు. ముక్కు ద్వారా శ్వాసించడం ద్వారా శరీర శక్తి మార్గాలను శుద్ధిచేసి, ప్రశాంతపరిచే నాడీ శుద్ధి ప్రాణాయామాన్ని సదస్యులతో చేయించారు. సద్గురు రికార్డు చేసిన సూచనలను అనుసరించి ఏడు నిమిషాల పాటు ధ్యానాన్ని సాధన చేయించారు.