calender_icon.png 27 January, 2026 | 8:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాయి సోషల్ ఎంపవర్‌మెంట్ సొసైటీకి తెలంగాణ గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డు

27-01-2026 06:40:13 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో మహిళా సాధికారత రంగంలో విశేష సేవలు అందిస్తున్న ఘట్ కేసర్ సాయి సోషల్ ఎంపవర్‌మెంట్ సొసైటీకి 2025 సంవత్సరానికి గాను తెలంగాణ గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డు లభించింది. మహిళల అభివృద్ధి, ఆర్థిక స్వావలంబన, సామాజిక చైతన్య కార్యక్రమాల్లో గత 25 సంవత్సరాలుగా అంకితభావంతో సేవలందిస్తూ, మహిళలను, యువకులను సాధికారత దిశగా నడిపించినందుకు ఈఅవార్డు ప్రదానం చేయబడింది.

రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతులమీదుగా ఈప్రతిష్ఠాత్మక అవార్డును సంస్థ స్థాపక సభ్యురాలు కాoటేకర్ మంజుల సంస్థ తరఫున స్వీకరించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల మహిళలకు నైపుణ్యాభివృద్ధి శిక్షణలు, ఉపాధి అవకాశాలు, స్వయం ఉపాధి కార్యక్రమాలు, అవగాహన సదస్సులు నిర్వహిస్తూ, మహిళలు ఆత్మగౌరవంతో స్వతంత్రంగా నిలబడేలా సాయి సోషల్ ఎంపవర్‌మెంట్ సొసైటీ కృషి చేస్తోందని అవార్డు కమిటీ ప్రశంసించింది.

ఈసందర్భంగా కాంటేకర్ మంజుల మాట్లాడుతూ... మా సంస్థ చేసిన సేవలకు రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా లభించిన ఈ గౌరవం మాకు మరింత బాధ్యతను పెంచిందన్నారు. ఇది కేవలం ఒక అవార్డు మాత్రమే కాదు మహిళల కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి వచ్చిన ప్రోత్సాహం అన్నారు. భవిష్యత్తులో మరింత విస్తృతంగా సేవలందిస్తూ మహిళల సాధికారత లక్ష్యాన్ని కొనసాగిస్తాం అని తెలిపారు.

అలాగే, ఈ గౌరవానికి కారణమైన గౌరవనీయ తెలంగాణ గవర్నర్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి అందిస్తున్న ప్రోత్సాహం అభినందనీయమని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తదితరులు పాల్గొన్నారు.