16 నెలలుగా జీతాల్లేవ్
- వాణిజ్య పన్నుల శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల అవస్థలు
- భార్యల పుస్తెల తాళ్లు కుదవపెట్టి పిల్లలకు ఫీజులు
- అప్పులు తెచ్చి వాహనాల కిస్తీలు కడుతున్న డ్రైవర్లు
- రాష్ట్రవ్యాప్తంగా 1400 మంది ఉద్యోగుల అరిగోస
- లీటర్ డీజిల్‌కు ఇప్పటికీ రూ.౫౦ మాత్రమేనట
హైదరాబాద్, జూన్ 26 (విజయక్రాంతి): నేను పదేళ్ల నుంచి వాణిజ్య పన్నుల శాఖలో ఔట్ సోర్సింగ్‌లో కారు డ్రైవర్‌గా పని చేస్తున్నారు. 16 నెలలుగా మాకు జీతాలు ఇవ్వడం లేదు. ఇళ్లు గడవడం కష్టంగా మారింది. ఒకవైపు అప్పులోల్లు ఇంటిమీదికి వస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం జీతం ఇస్తలేదు. ఇంటి ఖర్చుల కోసం అందినకాడికల్లా అప్పులు చేశా. నా పిల్లలకు, భార్యకు మొహం చూపించలేకపోతున్నా. నా బిడ్డల స్కూలు ఫీజు కట్టలేక.. వారిని బడికి కూడా పంపించడం లేదు.. అని వాణిజ్య పన్నుల శాఖలోని ఓ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి కన్నీటిపర్యంతమయ్యాడు.
ఆయన ఒక్కడే కాదు.. వాణిజ్య పన్నుల శాఖలో పని చేస్తున్న దాదాపు 1400 మంది తాత్కాలిక ఉద్యోగుల ఆవేదన ఇది. ఈ శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 16 నెలలుగా జీతాలు చెల్లించడం లేదు. దీంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇళ్లకు కిరాయిలు కట్టేలేక, పిల్లలకు బడి ఫీజులు చెల్లించలేక అరిగోసలు పడుతున్నారు. బీఆర్‌ఎస్ సర్కారు హయాంలో జనవరి 2023లో ఇచ్చిందే వారికి చివరి వేతనం.
ఆ తర్వాత జీతం పైసా ఇవ్వలేదు. దీంతో తాము కుటుంబాలను ఎలా పోషించుకోవాలని కన్నీరు పర్యంతం అవుతున్నారు. బుధవారం వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ ఆఫీసులో రివ్యూ మీటింగ్‌కు వచ్చిన ప్రిన్సిపల్ సెక్రటరీ సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీని కలిసి తమ బాధలు చెప్పుకోవాలని కొందరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ప్రయత్నించారు. అయితే రిజ్వీని కలిసేందుకు అధికారులు వారికి అవకాశం ఇవ్వలేదు. దీంతో తమ గోడును ఎవరికి చెప్పుకోవాలంటూ కమిషనర్ కార్యాలయం ముందే ఓ తాత్కాలిక ఉద్యోగి కన్నీటిపర్యంతమయ్యాడు.
అంతా చిరుద్యోగులే
రాష్ట్రవ్యాప్తంగా వాణిజ్య పన్నుల శాఖ ఆఫీసుల్లో డ్రైవర్లు, స్వీపర్లు, క్లర్కులు కలిసి మొత్తం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు 1600 మంది వరకు ఉంటారు. వీరిలో దాదాపు 200 మందికి రెగ్యులర్‌గా వేతనాలు చెల్లిస్తున్న ప్రభుత్వం.. 1400 మందికి మాత్రం 16 నెలలుగా చెల్లించడం లేదని బాధితులు చెబుతున్నారు. ఆఫీసులను బట్టి వేతనాలు చెల్లిస్తున్నారని, కొన్ని కార్యాలయాల్లోని సిబ్బందికి చెల్లిస్తూ.. మెజార్టీ ఆఫీసుల్లో ఆపేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భార్యల పుస్తెల తాళ్లు కుదవపెట్టి
జీతాలు లేక కుటుంబాలను పోషించుకోడవం కోసం అవస్థలు పడుతున్నామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అందినకాడికల్లా అప్పులు తెచ్చామని, ఇప్పుడు అప్పులిచ్చినవాళ్లు ఇండ్లమీదికి గొడవకు వస్తున్నారని విలపిస్తున్నారు. ఒక నెల, రెండు నెలలు అంటే సర్దుకుపోవచ్చు కానీ, 16 నెలలు పాటు వేతనం రాకుంటే కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలని ప్రశ్నిస్తున్నారు. బయట ఎక్కడా అప్పు పుట్టక.. చివరికి తన భార్య పుస్తెల తాడు కుదువబెట్టి.. బిడ్డల ఫీజు కట్టినట్లు ఓ కారు డ్రైవర్ వాపోయాడు. భార్య పుస్తెల తాడును తాకట్టు పెట్టిన పత్రాలను వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు కూడా చూపించినట్లు ఆ డ్రైవర్ కన్నీటి పర్యంతమయ్యాడు. ఫైనాన్స్ కింద వాహనం కొన్న డ్రైవర్ల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. వారు ప్రతినెలా ఈఎంఐలు కట్టలేక అప్పుల మీద అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
లీటర్ డీజిల్‌కు రూ.50 చెల్లిస్తున్న ప్రభుత్వం
వాణిజ్య పన్నుల శాఖలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 400 మంది డ్రైవర్లు తాత్కాలిక ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. వీరిలో అనేక మంది 10 నుంచి 15 ఏళ్లుగా అక్కడే పని చేస్తున్నారు. సొంత కారు ఉన్నవారిని డ్రైవర్లుగా ఎంపిక చేశారు. దీంతో కారుకు, డ్రైవర్‌కు కలిపి నెలకు రూ.34 వేల వేతనం ఇచ్చేలా 2017లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం జీవోను విడుదల చేసింది. పెట్రోల్ ఖర్చు కూడా డ్రైవర్లదే కావడం గమనార్హం. అయితే 2017లో విడుదల చేసిన జీవోలో లీటర్ డీజిల్‌కు రూ.50గా లెక్క గట్టారు. అదే లెక్క ఇప్పటికీ కొనసాగుతుంది. ప్రస్తుతం లీటర్ డీజిల్ రూ.95 వరకు ఉంది. దీంతో ప్రభుత్వం చెల్లిస్తున్న డీజిల్ ధర తమకు ఏ మాత్రం గిట్టుబాటు కావడం లేదని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం జీవోను సవరించాలని, డీజిల్ రేట్లను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.






