20-08-2025 01:16:05 AM
ఆర్.నారాయణ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘యూనివర్సిటీ పేపర్ లీక్’. ఆగస్టు 22న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో టీమ్ ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి నటుడు బ్రహ్మానందం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ.. “నారాయణ మూర్తి తేనెటీగ లాంటి మనిషి. అన్ని ప్రాంతాలకు తిరుగుతూ తేనె తీసుకొచ్చి అందరికీ పంచాలనే సంకల్పం ఉన్న మంచి మనిషి. ‘అందమైన హీరో ఎవరు?’ అని నన్నెవరైనా అడిగితే నారాయణమూర్తి పేరు చెప్తాను.. అందం అంటే గ్లామర్ కాదు.. మంచి మనసు.
నిరంతరం ప్రజల గురించే ఆలోచిస్తారు. ఈ సినిమా కూడా పేద ప్రజల కోసమే తీశారు. ఇప్పడు మన దేశ విద్యావ్యవస్థ మారిపోయింది. ఈ దేశాన్ని మళ్లీ బడిలో వేయాలి. ఇప్పుడు ఎలాంటి విశ్వవిద్యాలయాలయ్యాయని చెప్పడానికి ఎంతో కృషి చేసి నారాయణమూర్తి ఈ గొప్ప సినిమాను రూపొందించారు. ఇది వాస్తవానికి దూరంగా ఉన్న సినిమా కాదు. ఇందులో నిజాలుంటాయి. బూతులు ఉండవు.. జీవితపు లోతులుంటాయి. పేపర్ లీకేజ్‌కి బలి అయిపోయిన ఎంతోమంది గురించి చూడాల్సిన సినిమా ఇది.
మూర్తి చివరిశ్వాస వరకూ ప్రజల కోసం కష్టపడుతూ ఉండాలని కోరుకుంటున్నా. మూర్తి చేసినన్ని మంచి పనులు నేను చేయలేదు. అవే చెప్పులు.. అదే ప్యాంటుషర్టు.. అదే ఆటో. ఒక్క సినిమా హిట్ అయితే మనం ఎలా ప్రవర్తిస్తున్నామో అందరికీ తెలుసు. 40 ఏళ్ల కెరీర్‌లో ఎంతోమంది ఎన్నో ప్రలోభాలు పెట్టినా వాటికి తల వంచలేదు. నాకు వేంకటేశ్వరస్వామి అంటే ఇష్టం.. నారాయణమూర్తి అంటే ఇష్టం” అన్నారు.