20-08-2025 01:17:51 AM
వేతనాలు 30 శాతం పెంచాలని డిమాండ్ చేస్తూ సినీకార్మికులు 16 రోజులుగా సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సర్వసభ్య సమావేశాన్ని మంగళవారం ఏర్పాటుచేశారు. ఈ సమావేశానికి ఎంతో ఉత్సాహంగా ప్లకార్డులతో హాజరైన సినీకార్మికులు హైదరాబాద్ ఇందిరానగర్‌లో నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. హైదరాబాద్‌ను సినిమా హబ్‌గా మారుస్తాని చెప్పిన సీఎం రేవంత్ మాటలు తమలో ఉత్సాహం నింపాయని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సినీయర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని, సినీకార్మికుల ఐక్యవేదిక పేరుతో 24 క్రాఫ్ట్స్‌లకు చెందిన కార్మికులు పాల్గొన్నారు.
మరోవైపు ఫిలిం ఛాంబర్‌లో ఏడు కార్మిక యూనియన్లతో చర్చలు జరిగాయి. 9 టు 9 కాల్‌షీట్‌కు పనిచేసేందుకు కార్మిక నాయకులను ఛాంబర్ బాధ్యులు ఒప్పించే ప్రయత్నం చేశారు. మంగళవారం ఉదయం 11 నిర్మాతలు మరోమారు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు ఫెడరేషన్ నాయకులతో ఫిలిం ఛాంబర్ బాధ్యులు సమావేశం కానున్నారు.