calender_icon.png 16 August, 2025 | 8:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలి

16-08-2025 07:37:17 PM

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్..

లక్షెట్టిపేట (విజయక్రాంతి): భారీ నుండి అతి భారీ వర్షాల సూచన ఉన్నందున ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు త్రాగు నీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(District Collector Kumar Deepak) అన్నారు. శనివారం మున్సిపాలిటీ, మండలంలో పర్యటించి వార్డులలో చేరిన వర్షపు నీటి స్థితిని పరిశీలించి కొత్త కొమ్ముగూడెం గ్రామంలోని చెరువు నీటి నిల్వ పరిస్థితిని మండల తహసిల్దార్ దిలీప్ కుమార్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.... వాతావరణ శాఖ సూచన ప్రకారం జిల్లాలో శనివారం రోజున రెడ్ అలర్ట్, ఆదివారం రోజున ఆరెంజ్ అలర్ట్ ఉన్నందున ప్రజల రక్షణ కొరకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.

జిల్లాలోని కాజ్ వే లు, వాగులు, నదుల వద్దకు ప్రజలు ఎవరు వెళ్లకుండా పోలీస్, రెవెన్యూ, పంచాయతీ శాఖల అధికారుల సమన్వయంతో బందోబస్తు ఏర్పాటు నిర్వహిస్తున్నామని, లోతట్టు, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్రాగునీటి సరఫరా చేయడంతో పాటు పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. నివాస ప్రాంతాలలో నీటి విలువలు లేకుండా తొలగించాలని, అంతర్గత రహదారులు, మురుగు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని తెలిపారు. వరదలకు సంబంధించి ఏలాంటి సమస్య వచ్చిన ఎదుర్కునేందుకు ఎస్.డి.ఆర్.ఎఫ్. బృందాలు, ప్రజల రక్షణకు కావలసిన పరికరాలు, గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచామని తెలిపారు.

మున్సిపల్ కమిషనర్ సంపత్ తో కలిసి మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించి రిజిస్టర్లు పరిశీలించి ప్రజల తక్షణ సహాయం కొరకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి సిబ్బందిని నియమించాలని తెలిపారు. అనంతరం మండల కేంద్రంలోని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి వార్డులు, ల్యాబ్, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రత ప్రజలకు వివరించాలని తెలిపారు. అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని, వైద్యులు, సిబ్బంది విధుల పట్ల సమయపాలన పాటిస్తూ అందుబాటులో ఉండి బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.