calender_icon.png 16 August, 2025 | 9:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిరిజన గ్రామాల్లో పర్యటించిన తహసిల్దార్

16-08-2025 07:36:03 PM

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన

అశ్వాపురం,(విజయక్రాంతి): మండల పరిధిలోని గొందిగూడెం కొత్తూరు, ఎలకలగూడెం, వేములూరు, మనుబోతులగూడెం గిరిజన గ్రామాల్లో అశ్వాపురం తహసిల్దార్ ఏ. మణిధర్ శనివారం విస్తృతంగా పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన గొందిగూడెం కొత్తూరు, ఎలకలగూడెం గ్రామాల మధ్య తుఫాన్ ప్రభావంతో పొంగి ప్రవహిస్తున్న ఇసుకవాగు వరద ఉధృతిని ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ తుఫాన్ ప్రభావం కారణంగా మండలవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు ప్రమాదకరంగా పొంగిప్రవహిస్తున్నాయి. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలి. పొంగి ప్రవహించే వాగులను ఎట్టి పరిస్థితుల్లోనూ దాటే ప్రయత్నం చేయకూడదు అని విజ్ఞప్తి చేశారు.

వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం శనివారం రాత్రి వర్షపాతం మరింతగా పెరిగే అవకాశం ఉందని, దీంతో ఇసుకవాగు ప్రవాహం ఉధృతం కావచ్చని ఆయన తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొత్తం రెడ్ అలెర్ట్‌లో ఉన్న నేపథ్యంలో వాగులు, వంకల పరివాహక ప్రాంతాల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రజలు తప్పనిసరిగా తగు జాగ్రత్తలు పాటించి సురక్షితంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో అధికారులు, సిబ్బందిని సంప్రదించాలని ఆయన కోరారు.