24-09-2025 06:11:54 PM
ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్
తిమ్మాపూర్ ఆర్టిఏ కార్యాలయంలో సారధి పోర్టల్ సేవలు ప్రారంభం
కరీంనగర్ క్రైం,(విజయక్రాంతి): ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన సారథి పోర్టల్ సేవలను కరీంనగర్ జిల్లా ప్రజలు వినియోగించుకోవాలని ఆర్టిఏ నెంబర్ పడాల రాహుల్ పేర్కొన్నారు. సారథి పోర్టల్ ద్వారా అత్యుత్తమైన సేవలు అందుతాయని, ప్రజలు వీటిని వినియోగించుకోవాలని సూచించారు. తిమ్మాపూర్ లోని ఆర్టిఏ కార్యాలయంలో సారధి పోర్టల్ ద్వారా మొట్టమొదటిసారి పొందిన లర్నింగ్ లైసెన్స్ ను మెంబర్ పడాల రాహుల్ చేతుల మీదుగా అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటివరకు లర్నింగ్ లైసెన్సులు, పర్మినెంట్ లైసెన్సులు ఇతర లైసెన్స్ లో స్లాట్ బుకింగ్ లు టీజీ ట్రాన్స్పోర్టు వెబ్సైట్ ద్వారా జరిగేవని పేర్కొన్నారు. ప్రస్తుతం సారధి పోర్టల్ ద్వారా లర్నింగ్ లైసెన్సులు పర్మినెంట్ లైసెన్సులు ఇతర లైసెన్సులకు సంబంధించి సారధి పోర్టల్ ద్వారా ఆన్లైన్లో స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారు. http://sarathi.parivahan.gov.in/sarathiservices లో స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చని సూచించారు.
లైసెన్సుదారుడు ఇతర రాష్ట్రాల్లో నివాసం ఉండి ఉద్యోగరీత్యా, ఇతర కారణాల దృష్ట్యా తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి డైరెక్ట్ గా సారధి పోర్టల్ ద్వారా చిరునామా మార్పు గురించి ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకొని సేవలను పొందవచ్చని పడాల రాహుల్ పేర్కొన్నారు. గతంలో ఆ లైసెన్స్ దారుడు సంబంధిత ఆర్టీవో ఆఫీస్ నుంచి లైసెన్సులకు సంబంధించిన ఎన్వోసీ తీసుకురావాల్సిన అవసరం ఉండేదన్నారు. సారధి పోర్టల్ సేవల వల్ల ఎటువంటి ఎన్ఓసి తీసుకురావాల్సిన అవసరం లేకుండానే సేవలను వినియోగించుకోవచ్చని తెలిపారు.
ఇందులో భాగంగా కొత్తగా లర్నింగ్ లైసెన్సు తీసుకునేవారు స్లాట్ బుక్ చేసుకునే సమయంలో సంబంధిత డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత విధిగా ఐదు నిమిషాల నిడివిగల రోడ్డు భద్రతకు సంబంధించిన నియమ నిబంధనల వీడియోను చూడాలని, ట్రాఫిక్ నిబంధన పై అవగాహన పెంపొందించుకోవాలని రాహుల్ సూచించారు. లర్నింగ్ లైసెన్సులు తీసుకునే వారు తప్పకుండా రోడ్డు భద్రత సంబంధించిన నిబంధనలపై కచ్చితంగా అవగాహన పెంపొందించుకోవాలని పేర్కొన్నారు. తిమ్మాపూర్ ఆర్టిఏ కార్యాలయంలో ఈరోజు సారథి పోర్టల్ సేవలు ప్రారంభించడం అభినందనీయమని తెలిపారు.