calender_icon.png 15 May, 2025 | 3:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేటి నుంచే సరస్వతీ పుష్కరాలు

15-05-2025 01:08:53 AM

  1. కాళేశ్వరం వద్ద ఏర్పాట్లు పూర్తి 
  2. 26 వరకు నిర్వహణ
  3. పుష్కరఘాట్‌ను ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి
  4. హాజరుకానున్న మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్‌బాబు
  5. 12 రోజులపాటు రోజుకొక పీఠాధిపతి రాక
  6. తెలంగాణలో తొలిసారి సరస్వతీ నదీ పుష్కరాలు 

హైదరాబాద్, మే 14 (విజయ క్రాంతి)/మహదేవ్‌పూర్/కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానం వద్ద సరస్వతీ పుష్కరాలు గురువారం ప్రారంభంకానున్నాయి. ఈ నెల 26 వరకు పుష్కరాలు జరుగనున్నా యి. ఈసారి దేశవ్యాప్తంగా నాలుగు చోట్ల పుష్కరాలు జరుగుతుండగా దక్షిణాదిన ఒక్క కాళేశ్వరంలోనే నిర్వహిం చడం విశేషం.

ఈ పుష్కరాలకు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌తో పాటు కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్దఎత్తున భక్తు లు రానున్నారు. కాళేశ్వరంలో గురువారం త్రివేణి సంగమం వద్ద సరస్వతీ పుష్కరఘాట్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తారు. మంత్రులు కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతోపాటు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నా రు.

కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత, సరస్వతీ నదులు కలిసి త్రివేణి సంగమంగా పేర్కొంటారు. ఇక్కడ ఈ నెల 15 నుంచి మే 26 వరకు 12 రోజులపాటు సరస్వతీ పుష్కరాలు నిర్వహిస్తున్నారు. పుష్కరాల సందర్భంగా ప్రతి రోజు సుమారు 50 వేల మందికి పైగా భక్తులు పుష్కర స్నానం ఆచరిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.

భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ తెలిపారు. బుధవారం  సరస్వతీ ఘాట్ వద్ద ఆమె ఏర్పాట్లను పరిశీలించి, మాట్లాడారు. భక్తుల కోసం నూతన ఘాట్ నిర్మాణం, స్నానాల కోసం షవర్లు ఏర్పాటు, టెంట్లు, చలువ పందిళ్లు, లైటింగ్, వాటర్ ట్యాంకులు నిర్మించి, తాగునీటి ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.

అదనపు కౌంటర్లు, సిమెంట్ రోడ్ల నిర్మాణం, పిండప్రదాన మండపం, కేశఖండన మండపం నిర్మాణం, శాశ్వ త మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు. పుష్కర ఘాట్‌పైన సరస్వతీ అమ్మవారి రాతి విగ్ర హం ఏర్పాటు చేశామని చెప్పారు. హారతి ప్లాట్‌ఫారం నిర్మాణం చేపట్టామని, ఆలయం వద్ద ప్రత్యేక హోమాలు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు.

దీంతోపాటు త్రివేణి సంగమం వద్ద 12 రోజులపాటు ప్రత్యేక హారతి కార్యక్రమం నిర్వహిస్తారని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో యంత్రాగం పుష్కరాల నిర్వహణలో నిమగ్నమైందని చెప్పా రు. పుష్కరాలను విజయవంతం చేసేందుకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.

జిల్లా మం త్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పలుమార్లు సమీక్షలు నిర్వహించి, జిల్లా యంత్రాంగానికి స్పష్టమైన దిశా నిర్దేశం చేశారు. కాళేశ్వరం యాప్, వెబ్ పోర్టల్‌ను ప్రారంభించి, భక్తులు సాంకేతికంగా పొందే సేవలను సైతం అందులో పొందుపరిచారు. 

పుష్కరాలకు హాజరుకానున్న సీఎం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు. త్రివేణి సంగమం వద్ద సరస్వతీ ఘాట్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తారు. అనంతరం, కాళేశ్వర త్రివేణీ సంగమంలో సీఎం పుణ్యస్నానం ఆచరిస్తారు. ముఖ్యమంత్రితోపాటు పలువురు మంత్రులు కూడా ఈ పుష్కరాలలో పాల్గొంటారు. 

పుష్కరాల నిర్వహణ ఇలా..

12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ అరుదైన సరస్వతీ మహా పుష్కరాలకు దేవాదాయ శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. తొలిరోజైన గురువా రం ఉదయం 5:44 గంటలకు తొగుట ఆశ్రమ పీఠాధిపతి మాధవానంద సరస్వతీ స్వామీ పుష్క ర స్నానం ఆరంభిస్తారు. ప్రతీ రోజూ ఉదయం 8: 30 గంటల నుంచి 11 గంటల వరకు యాగాలు నిర్వహిస్తారు.

ప్రతీ రోజూ సరస్వతి ఘాట్‌లో 6: 45 నుంచి 7:35 గంటల వరకు ప్రత్యేక సరస్వతీ నవరత్న మాలహారతి నిర్వహిస్తారు. రాష్ట్రంలోని ప్రముఖ పీఠాధిపతులు రోజుకొకరు చొప్పున త్రివేణి సంఘమంలో పుష్కర స్నానం ఆచరిస్తా రు.

16న గురుమదానంద సరస్వతీ పిఠాధిపతి మాధవానంద సరస్వతీ స్వామి, 17న పరిపూర్ణానంద సరస్వతి స్వామి, 18న పుష్పగిరి పిఠాధిపతి అభినవోదండ విద్వా శంకర భారతి మహాస్వామి, 19న నాసిక్ త్రయంబకేశ్వర్ మహామండలేశ్వర్ ఆచార్య సంవిధానంద సరస్వతీ మహారాజ్, 23న హంపి విరూపాక్ష పిఠాధిపతి విద్యారణ్య భారతి స్వామి, 25న యోగానంద సరస్వతి స్వామి పుష్క ర స్నానం ఆచరిస్తారు.

ప్రతిరోజు సాయంత్రం ౫ నుంచి ఏడు గంటల వరకు ఆధ్యాత్మికవేత్తలచే ప్రవచనాలు నిర్వహిస్తారు. పుష్కర స్నానం ఆచరించేవారికి తాత్కాలిక టెంట్ సిటీలను ఏర్పాటు చేశారు. వీటితో పాటు రోజూ రాత్రి కళాప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలను అధికారులు ఏర్పా టు చేశారు.

పుష్కర స్నానంపై అచంచలమైన భక్తి విశ్వాసం 

భారతీయ సనాతన హైందవ సంప్రదాయాలలో పుష్కర స్నానానికి అచంచలమైన గొప్ప భక్తి విశ్వాసం ఉన్నది. ప్రాణకోటి మనగడకు ఆధారమైన జలాన్ని ఆరాధించడం ఓ మోక్ష ప్రదాయ మని శాస్త్రపరమైన నమ్మకం. భారతదేశంలోని 12 నదుల్లోనూ గురుడు మేశం నుంచి మీన రాశి వరకు పన్నెండు రాశులలో ఒక్కొక్క రాశిలోకి ప్రవేశించినప్పుడు ఆయా నదులకు పుష్కరాలు వస్తాయి.

గురుడు మిథున రాశిలోకి ప్రవేశించినప్పుడు సరస్వతీ నదికి పుష్కరాలు ప్రారంభమ వుతాయి. రెండు జీవనదులు కలిసిన చోట సరస్వతి నది ఉద్భవించునని కాళేశ్వర ఖండంలో స్పష్టం చేయబడింది. అందుచేత కాళేశ్వరంలో రాష్ట్ర ప్రభుత్వం పుష్కరాలు నిర్వహిస్తున్నది. 

సరస్వతీ నది పుష్కర యాత్ర ఫలం

మాతృవంశం వారికి పిండ ప్రదానం చేయ డం సరస్వతీ పుష్కరయాత్ర ఫలంగా చెపుతారు. అందుకే దాన్ని మాతృగయ అని కూడా అంటా రు. సరస్వతీ నది అతి పురాతనమైనది. సరస్వతి నదిని కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద ప్రవహించే అంతర్వాహిని(అదృశ్య నది)గా పరిగ ణిస్తారు. ఈ పుష్కరాన్ని బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి 12 రోజుల పాటు ఆచరిస్తారు.

బృహస్పతి దేవ గురువు. బృహస్పతి జ్ఞానం, విద్య, ఆధ్యాత్మికతకు అధిపతిగా పరిగణించబడుతున్నాడు. బృహస్పతిని గురుగ్రహం అని కూడా అంటారు. గురువు ఏడాదికి ఒకసారి తన రాశిని మార్చుకుంటాడు. ఒక రాశి నుంచి వెళ్లిన తర్వాత అదే రాశిలోకి అడుగు పెట్టడానికి 12 ఏళ్లు పడుతుంది.

ఈసారి మే 14న రాత్రి 10:35 గంటలకు మిథునరాశిలోకి బృహస్పతి అడుగు పెట్టనున్నాడు. మరుసటి రోజు సూర్యోదయం నుంచి పుష్కర పుణ్యస్నానాలు ఆచరించాల్సి ఉంటుంది. కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో పుష్కర స్నానం చేసిన తర్వాత మహా సరస్వతీ అమ్మవారిని దర్శించుకుంటే చాలా పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. 

పుష్కరాల పోస్టర్ విడుదల చేసిన మంత్రి సురేఖ

సరస్వతీ నదీ పుష్కరాల కోసం తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డు పోస్టర్‌ను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ బుధవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ.. నదులను పరిరక్షించడం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధించడం, బట్టలు ఉతకడం, వ్యర్థాలను సరిగ్గా నిర్వహణ చేయడం, నీటి కాలుష్యం నుంచి చర్మవ్యాధులను నివారించడానికి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.