15-05-2025 12:46:12 AM
న్యూఢిల్లీ, మే 14: భూకంపం ధాటికి విలవిల్లాడిన తుర్కియే (టర్కీ)ను ‘ఆపరేషన్ దోస్త్’ ద్వారా భారత్ ఆదుకుంది. ప్రతి గా తుర్కియే మనదేశం మీదకి దాడి చేసేందుకు వచ్చిన దాయాది పాకిస్థాన్‌కు 350కి పైగా డ్రోన్లు పంపి సాయం చేసింది. ఇప్పటికే ఈ విషయంలో అంతా తుర్కియేను దుమ్మెత్తి పోస్తున్నారు. తాజాగా మరో విషయం బహిర్గతమైంది. డ్రోన్లు పంపడ మే కాకుండా సైనిక సహాయం కూడా అందజేసినట్టు తెలుస్తోంది.
ఆపరేషన్ సిందూర్ దాడుల్లో మరణించిన పాక్ సైనికుల్లో తుర్కియేకు చెందిన ఇద్దరు సైనికు లు ఉన్నట్టు సమాచారం. తుర్కియేకు చెందినవిగా అనుమానిస్తున్న బేరక్తర్ టీబీ వైఐహెచ్‌ఏ డ్రోన్లను భారత్ కూల్చేసి న విషయం తెలిసిందే. ఇప్పటికే తుర్కియే కు చెందిన ఆసిస్ గార్డ్ సోనగర్ డ్రోన్లను పాకిస్థాన్ ఉపయోగించిందని ఫోరెన్సిక్ నిపుణులు వెల్లడించారు.
తుర్కియే చేసిన పనులకు భారతదేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు సామాజి క మాధ్యమాల్లో బాయ్ కాట్ టర్కీని ట్రెండ్ చేస్తున్నారు. తుర్కియేకు చెందిన దిగుమతులను భారత్ నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు.
యాపిల్స్, సెరామిక్స్ వంటి ఇతర ఉత్పత్తులు తుర్కియే నుంచి భారత్‌కు దిగుమతయ్యే వాటిలో ఉన్నాయి. ఇప్పటికే పుణెకు చెందిన వ్యా పారులు తుర్కియే ఉత్పత్తులను కొనడం లేదు. అంతే కాకుండా తుర్కియేకు వెళ్లేందుకు టికెట్లు, హోటళ్లు బుక్ చేసుకున్న అనేక మంది వాటిని రద్దు చేసుకుంటున్నారు.
తుర్కియే వస్తువుల దిగుమతి నిషేధించండి
దాయాది పాకిస్థాన్‌కు మద్దతుగా నిలుస్తున్న తుర్కియేకు ఎవరూ వెళ్లకూడదని పలువురు సూచిస్తున్నారు. కేవలం భారత వ్యక్తులు తుర్కియేకు వెళ్లడం మాత్రమే కాకుండా తుర్కియే నుంచి ఎటువంటి వస్తువుల ను కూడా దిగుమతి చేసుకోవద్దని డిమాండ్ చేస్తున్నారు. తుర్కియే అందాలను చూసేందుకు ఏటా లక్షల మంది భారతీయులు అక్కడికి వెళ్తుంటారు.
ఇప్పుడు వారంతా తమ ప్రణాళికలు మార్చుకుంటూ తుర్కియేకు వెళ్లడం లేదు. అంతే కాకుండా తుర్కియే నుంచి భారత్‌కు మార్బుల్, యాపిల్స్ ఎక్కువ మోతాదులో దిగుమతి అవుతాయి. ఈ దిగుమతుల విలువ సుమారుగా రూ. 5వేల కోట్ల వరకు ఉండనుంది. ఇవి మాత్రమే కాకుండా సెరామిక్స్, బంగారం, సున్నపురాయి, సిమెంట్, మినరల్ ఆయిల్, ఐరన్, స్టీల్ వంటివి కూడా దిగుమతి అవుతున్నాయి.
ఒప్పందం రద్దు చేసుకున్న జేఎన్‌యూ
ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో జవహర్‌లాల్ నెహ్రూ (జేఎన్‌యూ) విశ్వవిద్యాలయం తుర్కియేలోని ఇనోనూ విశ్వవిద్యాలయంతో జరిగిన ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. జాతీయ భద్రతను దృష్ఠిలో ఉంచుకునే ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్టు జేఎన్‌యూ ఎక్స్‌లో ప్రకటించింది. ఈ ఒప్పందంలో అధ్యాపకులు, విద్యార్థుల మార్పిడికి సంబంధించిన విషయాలు ఉన్నాయి.
తుర్కియే వార్తా సంస్థకు షాక్
తుర్కియేకు చెందిన వార్తా సంస్థ టీఆర్‌టీ ఎక్స్ లో కనిపించకుండా బుధవారం భారత్ నిషేధం విధించింది. పాక్‌కు అనుకూల కథనాలు అందిస్తున్న నేపథ్యంలోనే నిషేధం విధించారు. చైనాకు చెందిన పలు కంపెనీల సామాజిక మాధ్యమ ఖాతాలపై కూడా భారత్ నిషేధం విధించింది.