calender_icon.png 15 May, 2025 | 3:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వతంత్ర బలూచ్!

15-05-2025 01:00:33 AM

  1. రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్థాన్‌గా ప్రకటించుకున్న బలూచిస్థాన్
  2. సోషల్ మీడియాలో ట్రెండింగ్
  3. ఢిల్లీలో దౌత్య కార్యాలయం ఏర్పాటుచేయాలని వినతి

న్యూఢిల్లీ, మే 14: భారత్ దాడులతో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతున్న పాకిస్థాన్‌కు బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ ఏ) ఊహించని షాక్ ఇచ్చింది. బుధవారం తమ ప్రాంతాన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. ఇకపై తాము ‘రిపబ్లిక్ ఆఫ్ బలూ చిస్థాన్’ అని తెలిపింది. గత కొంతకాలంగా పాకిస్థాన్ నుంచి విముక్తి పొంది ప్రత్యేక దేశంగా ప్రకటించాలని పోరాటం చేస్తున్న బీఎల్‌ఏ స్వాతంత్య్రం ప్రకటించుకోవడం విశేషం.

తమ ప్రాంతంలోని సహజ వనరుల ను పాకిస్థాన్ దోపిడీ చేస్తోందని, సైన్యం తమను అణచివేస్తోందని బలూచ్ ఆర్మీ ఆరోపిస్తోంది. ఎన్నో పోరాటాల తర్వాత తాజాగా స్వాతంత్రం ప్రకటించుకుంది. భారతదేశం ఢిల్లీలో బలూచిస్థాన్ ప్రత్యేక కార్యాలయం, దౌత్య కార్యాలయాలను ఏర్పాటుచేయాలని బలూచ్ నేత మిర్ యార్ బలూచ్ కోరారు.

కొత్త పార్లమెంట్, జాతీయ చిహ్నం, జాతీయ గీతాలు కూడా ప్రకటించగా.. అవి సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ‘పాకిస్థాన్.. మీకు ఆర్మీ ఉంటే బలూచ్‌కు కూడా ఆర్మీ ఉంది. బలూచ్ స్వాతంత్ర సమరయోధులు దాడి చేస్తారు జాగ్రత్త.’ అని బలూచ్ నేత మిర్ యార్ పాక్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఎక్స్ ఖాతాలో బలూచ్ నేత మిర్ యార్ మే 9నే ప్రత్యేక బలూచ్ దేశం గురించి ప్రకటించారు.

ఆరోజే ప్రత్యేక, స్వతంత్ర దేశం సంకేతాలను పంపారు. ‘ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ పతనం దగ్గర పడిన నేపథ్యంలో త్వరలోనే ఒక ప్రకటన వస్తుంది.’ అని పేర్కొన్నారు. బుధవారం కూడా ఎక్స్‌లో వరుసగా పోస్ట్‌లు చేశారు. బలూచిస్థాన్ ప్రాంతం నుంచి పాక్ దళాలను వెనక్కి పిలవాలని పాకిస్థాన్‌ను డిమాండ్ చేశారు. ‘ఐక్యరాజ్యసమితి కూడా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్థాన్‌ను గుర్తించాలి.

సభ్యదేశాలు దీనికి మద్దతివ్వాలి. బలూచిస్థాన్‌ను గుర్తించేందుకు సమావేశం ఏర్పాటు చేయాలని ఐక్యరాజ్య సమితిని కూడా అభ్యర్థించాం. ఐక్యరాజ్య సమితిలోని సభ్యదేశాల మద్దతు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్థాన్‌కు ఎంతో అవసరం. సొంత కరెన్సీ, పాస్‌పోర్ట్‌ల ముద్రణ కోసం బిలియన్ల నిధులు మంజూరు చేయాలి.’ అని కోరారు. 

ఏడు చోట్ల దాడులు.. 

ఆపరేషన్ హెరాఫ్ 2.0 ద్వారా పాకిస్థాన్‌లోని ఏడు జిల్లాల్లో దాడులు చేసినట్టు బీఎల్‌ఏ తెలిపింది. పంజగుర్ ప్రాంతంలోని ఆర్మీ పోస్ట్‌పై దాడి చేసి ఇద్దరు సైనికులను హతమార్చినట్టు, ఈ ఘటనలో మరో ఐదుగురు సైనికులకు గాయాలయ్యాయని బీఎల్‌ఏ ప్రకటించింది. పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లుగా అనుమానం ఉన్న నలుగురు వ్యక్తులను నోష్కీ ప్రాంతంలో హతమార్చింది.

ఆపరేషన్ హెరాఫ్ 2.0కు సంబంధించి బీఎల్‌ఏ అధికార ప్రతినిధి జీయాంద్ బలూచ్ ఒక ప్రకటనను విడుదల చేశారు. ‘కుజ్దార్ జిల్లాలోని ఆర్నాచ్ క్రాస్ హైవేను శనివారం రెండుగంటలకు పైగా బలూచ్ ఫైటర్లు అదుపులోకి తీసుకున్నారు. వాహన తనిఖీలు నిర్వహించి.. రెండు వాహనాలను ఆపేశారు. పంజగుర్ ప్రాంతంలో పాకిస్థాన్ ఆర్మీ స్వాధీనంలో ఉన్న పోస్ట్‌పై బీఎల్‌ఏ ఫైటర్స్ దాడులు చేసి ఇద్దరు సైనికులను హతమార్చారు.

మరో ఐదుగురు సైనికులు గాయపడ్డారు. పరూమ్ జైన్, గరాప్ తదితర ప్రాంతాల్లో కూడా దాడులు చేశాం’. అని బీఎల్‌ఏ ప్రకటించింది. ఈ ఆపరేషన్ కొనసాగుతుందని బలూచ్ ఆర్మీ ప్రకటించింది. పాకిస్థాన్ మీద భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో దాడులు మొదలెట్టినప్పటి నుంచి బీఎల్‌ఏ ఉధృతంగా పోరాడుతోంది.