23-01-2026 12:22:48 AM
హైదరాబాద్, జనవరి 22 : దేశవాళీ క్రికెట్‌లో ముంబై యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ సూపర్ ఫామ్ కొనసాగుతోంది. గత కొంతకాలంగా అత్యంత నిలకడగా రాణిస్తున్న సర్ఫరాజ్ తాజాగా హైదరాబాద్‌తో రంజీ మ్యాచ్‌లోనూ సెంచరీ బాదాడు. ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఆరంభంలోనే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో సర్ఫరాజ్ ఖాన్ అద్భుత సెంచరీతో జట్టును ఆదుకున్నాడు.
హైదరాబాద్ బౌలర్లపై ఆధిపత్యం కనబరుస్తూ ముంబైకి భారీస్కోరు అందించాడు. సిద్దేశ్ లాడ్ కూడా శతకం సాధించాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 249 పరుగులు జోడించారు. దీంతో తొలిరోజు ఆటముగిసే సమయానికి ముంబై 4 వికెట్లకు 334 పరుగులు చేసింది. సిద్దేశ్ లాడ్ (104) ఔటవగా.. సర్ఫరాజ్ ఖాన్ 142 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఇటీవల విజయ్ హజారే ట్రోఫీలోనూ సర్ఫరాజ్ రాణించాడు.