23-01-2026 12:21:30 AM
చరిత్ర సృష్టించిన భారత షట్లర్
జకార్తా, జనవరి 22 : భారత స్టార్ షట్లర్ పీవీ సింధు చరిత్ర సృష్టించింది. భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ఎవ్వరికీ సాధ్యం కాని అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. కెరీర్‌లో 500వ విజయాన్ని అందుకుని రికార్డులకెక్కింది. ఈ ఘనత సాధించిన తొలి భారత ప్లేయర్‌గా ఘనత సాధించింది. ఓవరాల్‌గా వరల్డ్ బ్యాడ్మింటన్‌లో ఈ మైలురాయి అందుకున్న ఆరో ప్లేయర్‌గా నిలిచింది. ఇండోనేషియా మాస్టర్స్ టోర్నీ ప్రీక్వార్టర్ ఫైనల్లో సాధించిన విజయంతో ఆమె ఈ రికార్డు అందుకుంది. డెన్మార్క్ ప్లేయర్ హోజ్‌మార్క్‌పై 21-19, 21-18 స్కోరుతో గెలిచిన సింధు క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. క్వార్టర్ ఫైనల్లో సింధు చైనా ప్లేయర్ చెన్ యూతో తలపడనుంది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ కూడా క్వార్టర్స్ చేరాడు.