24-01-2026 06:49:15 PM
జిల్లా కలెక్టర్ కె. హరిత
కాగజ్‌నగర్,(విజయ క్రాంతి): పంచాయితీల అభివృద్ధిలో సర్పంచ్‌లదే ప్రధాన భూమిక అని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు. శనివారం కాగజ్‌నగర్ పట్టణంలోని మైనారిటీ సంక్షేమ పాఠశాలలో పంచాయితీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో కాగజ్‌నగర్ డివిజన్ పరిధిలోని కాగజ్‌నగర్, దహెగాం, బెజ్జూర్, చింతలమానేపల్లి, కౌటాల మండలాలకు చెందిన సర్పంచ్‌లకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్‌ల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై సర్పంచ్‌లకు పూర్తి అవగాహన ఉంటుందని, వాటి పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. పంచాయితీలలో ఆదాయ వనరులు పెంచుకోవాలని, గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు ఎప్పటికప్పుడు చేపట్టి పర్యవేక్షించాలని అన్నారు.
గ్రామపంచాయతీ చట్టాలపై సర్పంచ్‌లు అవగాహన పెంచుకోవాలని, ప్రజలకు కనీస సౌకర్యాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతర్గత రహదారులు, మురుగు కాలువలు, ఇందిరమ్మ ఇండ్ల పనులు త్వరితగతిన పూర్తి చేయడానికి అధికారుల సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు చేరేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు.
గ్రామాల్లో రైతులు ఒకే రకమైన పంటలకే పరిమితం కాకుండా పంటల మార్పిడి విధానాన్ని అవలంబించి ఆర్థికంగా అభివృద్ధి చెందేలా అవగాహన కల్పించాలని తెలిపారు. పంచాయితీ విధులు, అధికారాలు, ప్రజా సంక్షేమంపై అందిస్తున్న ఈ శిక్షణను సర్పంచ్‌లు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి బిక్షపతి గౌడ్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి లక్ష్మీనారాయణ, డివిజనల్ పంచాయతీ అధికారులు ఉమర్ హుస్సేన్, హరి ప్రసాద్, ఐదు మండలాల మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, శిక్షకులు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.