24-01-2026 07:59:31 PM
సోషల్ మీడియా ప్రచారలో యూత్ కాంగ్రెస్ ముందుండాలి
పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు పని చేయాలి
పార్టీ కోసం రోజు రెండు గంటల కేటాయించారు
భావి భారత ప్రధానిగా రాహుల్ గాంధీని చేసేంతవరకు విశ్రమించకూడదు
జిల్లా యూత్ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో స్థానిక శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి
వనపర్తి,(విజయక్రాంతి): యూత్ కాంగ్రెస్ నుంచి మొదలైన రాజకీయాలు చాలా పటిష్టంగా ఉంటాయని రాజకీయాలకు యూత్ కాంగ్రెస్ పునాది లాంటిదని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. శనివారం వనపర్తి పట్టణంలోని ఎం వై ఎస్ ఫంక్షన్ హాల్ లో వనపర్తి జిల్లా యూత్ అధ్యక్షులు వాకిటి ఆదిత్య అధ్యక్షతన నిర్వహించిన జిల్లా యూత్ కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. యువకులు అనుకుంటే దేనినైనా సాధించగలరని వనపర్తి జిల్లా పరిధిలోని యూత్ కాంగ్రెస్ లో ఉన్న ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పనిచేయాలని వారన్నారు.
అవినీతిమయమైన బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో కాంగ్రెస్ ప్రభుత్వం పై దుష్ప్రచారాలు చేస్తుందని అలాంటి వాటిని యూత్ కాంగ్రెస్ యువకులు ఎప్పటికప్పుడు ఖండిస్తూ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. భావి భారత ప్రధానిగా రాహుల్ గాంధీ గారిని చేసేంతవరకు నిర్విరామంగా కృషి చేయాలని అందులో యువతనే ప్రధాన పాత్ర పోషించాలని ఎమ్మెల్యే యువకులకు సూచించారు.ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో వనపర్తి నియోజకవర్గంలో 40 మందికి పైగా సర్పంచులు యువకులేనని కాంగ్రెస్ పార్టీ యువకులకు అంత ప్రాధాన్యత ఇస్తుందని గమనించాలని వారు పేర్కొన్నారు.
వనపర్తి నియోజకవర్గ పరిధిలోని యువకులు నెలకు మారు యూత్ సమావేశాలు నిర్వహించాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రత్యక్ష రాజకీయాలపై ఆసక్తి ఉన్న యువకులకు సర్వేల ఆధారంగా అవకాశం ఇవ్వబడుతుందని ఎమ్మెల్యే సూచించారు. గ్రామాల్లో రైతు కూలీలతో మమేకమైపోయి గ్రామాల్లోని సమస్యలను తెలుసుకొని తీర్చడంపై దృష్టి సారించాలన్నారు. జిల్లాల పునర్విభజన పై అవగాహన లేని కొందరు బి ఆర్ ఎస్ నాయకులు జిల్లాల రద్దు అంటూ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని అలాంటి వారికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్యే సూచించారు.
బేద అభిప్రాయాలు ఎన్ని ఉన్నా అందరూ కలిసి పనిచేసే కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పాటుపడాలని ఆయన పేర్కొన్నారు. విత్ ఐవైసీ యాప్ ను ఉపయోగించి మనం చేసే కార్యక్రమాలను నమోదు చేయాలన్నారు. ఈ సమావేశంలో వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ , రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ జక్కిడి శివ చరణ్ రెడ్డి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఇంచార్జి సయ్యద్ ఖలీద్ గారు, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మాజీద్ , వనపర్తి జిల్లా అధ్యక్షులు వాకిటి ఆదిత్య , శివాంత్ రెడ్డి, సుకన్య, నియోజకవర్గంలోని ఆయా మండలాల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు యువకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.