24-01-2026 07:37:00 PM
అదనపు కలెక్టర్ దీపక్ తివారీ
కుమ్రంభీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): పదవ తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారీ అన్నారు. శనివారం ఆసిఫాబాద్ మండలంలోని బురుగుడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యా ప్రమాణాలు, పదవ తరగతి వార్షిక పరీక్షల సిద్ధతతో పాటు మధ్యాహ్న భోజన పథకం అమలును క్షుణ్ణంగా పరిశీలించారు. పదవ తరగతి విద్యార్థుల ప్రగతిపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించిన అదనపు కలెక్టర్ రానున్న పరీక్షలను దృష్టిలో పెట్టుకొని విద్యార్థుల సిద్ధతను అడిగి తెలుసుకున్నారు.
వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వంద శాతం ఉత్తీర్ణత సాధనే లక్ష్యంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు. భోజనం నాణ్యతతో పాటు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులను ఆదేశించారు. వంటగది, పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పాఠశాలలోని తాగునీటి సదుపాయం, మరుగుదొడ్లు తదితర మౌలిక వసతులను పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రధానోపాధ్యాయుడిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.