20-11-2025 12:16:48 PM
మంత్రి జూపల్లి కృష్ణారావు.
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 17 శాతం తేమ ఉన్న ధాన్యాన్ని అనుమతి మేరకు తప్పనిసరిగా కొనుగోలు చేయాలని, తేమ శాతం పేరుతో రైతులను వేధిస్తే సహించేది లేదన్నారు. గురువారం కుడికిల్ల, నార్లాపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి జూపల్లి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కొనుగోలు కేంద్రాల్లో జాప్యం జరగకుండా చూడాలని, కొనుగోలు చేసిన వెంటనే రైతులకు రసీదు ఇవ్వాలని, ధాన్య వివరాలను వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. రైతుల ఖాతాల్లోకి చెల్లింపులు త్వరగా జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు దళారులకు కాకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని మంత్రి జూపల్లి కోరారు.