16-05-2025 11:05:16 PM
జిల్లా షెడ్యూల్ కులాల సంక్షేమ అధికారి రజిత
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో ఎస్సీ వసతి గృహాల్లో మూడవ తరగతి నుంచి పీజీ చదువుకునే విద్యార్థుల వరకు వసతి గృహాలను ఉపయోగించుకోవచ్చు అని జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారిని రజిత తెలిపారు. శుక్రవారం ఆమె తమ కార్యాలయంలో విజయ క్రాంతి ప్రతినిధితో మాట్లాడారు. కామారెడ్డి జిల్లాలో 30 షెడ్యూల్ కులాల వసతి గృహాలు ఉన్నాయని2468 విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. మూడవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు 26 వసతి గృహాలు పదో తరగతి నుండి పీజీ వరకు నాలుగు వసతి గృహాలు ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందని, బాలుర వసతి గృహంలో బాలురు మాత్రమే ఉంటారని అలాగే బాలికల వసతి గృహంలో బాలికలు మాత్రమే ఉండడం వార్డెన్ కూడా మహిళలే ఉన్నారన్నారు.
కామారెడ్డిలో ఇంటర్ నుండి పిజి వరకు బాలురకు ఒక వసతి గృహం బాలికలకు మరో వసతి గృహం ఇదే క్రమంలో బాన్సువాడ లో బాలికలకు ఒక వసతి గృహం బాలురకు ఒక వసతి గృహం ఉందన్నారు.వారి అవసరాల కు తగిన విధంగా మౌలిక సదుపాయాలను ప్రభుత్వం సమకూర్చడం జరిగిందని అన్నారు. వసతి గృహాల్లో చదువుకున్న ఇంటర్ మీడియట్ విద్యార్థిని విద్యార్థులు 82 శాతం పదవ తరగతిలో 94% ఉత్తీర్ణత సాధించడం జరిగిందన్నారు. వచ్చే విద్యా సంవత్సరం 100% ఉత్తీర్ణత సాధించడానికి ఇప్పుడే ప్రణాళిక సిద్ధం చేసుకోవడం జరిగిందన్నారు.ప్రభుత్వ నియమ నిబంధనలు మేరకు విద్యార్థి విద్యార్థులకు పౌష్టిక ఆహారం సక్రమంగా సరైన సమయానికి అందించడం జరుగుతుందని తెలిపారు. మూడో తరగతి నుండి పదవ తరగతి వరకు చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు ఎదుగుదల దశ ఉంటుంది.
కాబట్టి వారికి ప్రభుత్వం ఇచ్చిన మెనూ ప్రకారం ఆహారం అందించడం జరుగుతుందని అలాగే పౌష్టిక ఆహారం సరిగ్గా వార్డెన్లు ఇవ్వడం లేదని ఇప్పటివరకు ఏ విద్యార్థిని విద్యార్థి ఫిర్యాదు చేయలేదని చెప్పారు. పౌష్టిక ఆహారం విషయంలో విద్యార్థిని విద్యార్థులు ఎవరు ఫిర్యాదు చేసిన తక్షణమే పర్యవేక్షించి చట్టంలోని నిబంధనల మేరకు వార్డెన్లపై కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. విధుల పట్ల ఎవరు నిర్లక్ష్యంగా వ్యవహరించిన సహించేది లేదని ఆమె అన్నారు. వార్డెన్లో ప్రతిరోజు విద్యార్థిని విద్యార్థులకు అందించిన పౌష్టిగా ఆహారం ఫోటో తీసి ప్రతిరోజు పంపించడం జరుగుతుందన్నారు.తాను కూడా స్వయంగా ఆకస్మికంగా హాస్టల్ లను తనిఖీ చేయడం జరుగుతుందని ఆ సందర్భంలో విద్యార్థిని విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకోవడం ఆకస్మిక తనిఖీలు తరచుగా చేస్తూ ఉంటానని చెప్పారు. వారానికి ఐదు రోజులు గుడ్లు వారానికి ఒకరోజు చికెన్ నెలకు ఒకరోజు మటన్ మిగతా రోజుల్లో కూరగాయలు, పప్పులు, ఇవ్వడం జరుగుతుందని ఆమె తెలిపారు.