23-08-2025 02:45:13 PM
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా..
రాజన్న సిరిసిల్ల (విజయక్రాంతి): పర్యావరణ హితమైన మట్టి గణపతి విగ్రహాలను పూజించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా(District Collector Sandeep Kumar Jha) ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వారి ఆధ్వర్యంలో మట్టి గణపతులపై అవగాహన కల్పించేందుకు రూపొందించిన వాల్ పోస్టర్ ను ఆవిష్కరణ చేశారు. పర్యావరణ సంరక్షణ కోసం జిల్లాలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వారి ఆధ్వర్యంలో 2,000 వేల మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల ఆధ్వర్యంలో ప్రజలకు ఉచితంగా ఇట్టి విగ్రహాలను పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు.
వినాయక చవితి ఉత్సవాలు ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. ఆది దేవుడైన వినాయకుడిని మట్టితో తయారు చేసి పూజించటం ద్వారా సత్ఫలితాలు లభిస్తాయని, మన ఆకాంక్షలు నెరవేరుతాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్లాస్టర్ అఫ్ ప్యారీస్ కు బదులుగా మట్టి విగ్రహాలను పూజించడం వల్ల పర్యావరణ సంరక్షణ జరుగుతుందని, మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అసిస్టెంట్ సైంటిస్ట్ జ్యోతి, కలెక్టరేట్ పర్యవేక్షకులు ప్రవీణ్, రాంచందర్, తహశీల్దార్ ఫారూక్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నరు.