23-08-2025 02:53:02 PM
సుధాకర్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): సిపిఐ సీనియర్ నాయకులు, మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ పార్లమెంటు సభ్యులు సురవరం సుధాకర్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శులు పల్లా దేవేందర్ రెడ్డి, ఎల్ శ్రవణ్ కుమార్ అన్నారు. సురవరం మృతికి సంతాపంగా నల్లగొండ జిల్లా సిపిఐ పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తొలినాళ్ల నుండి చివరి వరకు కమ్యూనిస్టు పార్టీతోనే ఉంటూ నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి పని చేశారని చెప్పారు. ఆయనకున్న ఆస్తులను ప్రజలకు ధారా దత్తం చేసి ప్రజాసేవలో నిమగ్నమైన నిబద్దతగల నేత అని తెలిపారు. సిపిఐ పార్టీకి మూడు పర్యాయాలు జాతీయ కార్యదర్శిగా, పార్లమెంటు సభ్యులుగా 2 సార్లు పనిచేసిన ఆయన ఆ పదవులకు వన్నె తెచ్చారని చెప్పారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషి చరిత్రలో నిలిచిపోతుందన్నారు.
జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల సాధన కోసం ఎస్ఎల్బీసీ సోరంగము పూర్తి చేసి డిండికి లిఫ్ట్ చేసి నలగొండ జిల్లాకు సాగు తాగునీరు అందించాలని డిండి నుంచి నల్లగొండ వరకు స్వయంగా పాదయాత్ర నిర్వహించి ప్రాజెక్టుల సాధనకు కృషి చేశారని అన్నారు. జిల్లాలోని ఫ్లోరైడ్ సమస్యలపై ఎంపీగా పార్లమెంటులో సుదీర్ఘ ఉపన్యాసం చేసి నివారణ కోసం దేశవ్యాప్తంగా చర్చ లేవనెత్తి తన వంతు కృషి చేశారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అగ్రబాగాన ఉండి జాతీయ పార్టీగా తెలంగాణను సమర్థించి ముందుండి నడిపారు. విద్యుత్ ఉద్యమంలో అగ్రభాగాన్ని నిలబడి పోరాడి రాష్ట్ర చరిత్రలో మైలురాయిగా నిలిచారని అన్నారు. 18 సంవత్సరాలు నిండిన యువకులకు ఓటు హక్కు కల్పించాలని దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని నిర్వహించారు. సురవరం ఆశయాల సాధన కోసం పయనిస్తూ ఆయన చూపిన మార్గాన ముందుకు సాగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పబ్బు వీరస్వామి, పట్టణ కార్యదర్శి కేఎస్ రెడ్డి, నాయకులు వి లెనిన్, దోటి పండరి, విగ్నేశ్వర్, నారాయణ, వీరయ్య, అక్కలయ్య, రామకోటి, సయ్యద్ మజీద్,సుజాత విజయ తదితరులు పాల్గొన్నారు.