22-12-2025 01:50:49 AM
హైదరాబాద్, సిటీ బ్యూరో, డిసెంబర్ 21 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని నారాయణగూడ ప్రాంతం ఆదివారం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కార్తీక మాస దీక్షల విరమణ, అయ్యప్ప మండల పూజల వేళ.. కేశవ్ మెమోరియల్ కాలేజీ మైదానం అయ్యప్ప శరణు ఘోషతో మార్మోగింది. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి మహా పడిపూజ మహోత్సవం అంగరంగ వైభవంగా, కనుల పండు వగా జరిగింది.
భక్తిభావం ఉట్టిపడేలా జరిగిన ఈ వేడుకకు నగర నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు, అయ్యప్ప స్వాము లు, రాజకీయ ప్రముఖులు తరలిరావడంతో మైదానం కిటకిటలాడింది. భూతల స్వర్గాన్ని తలపించేలా.. పూజా ప్రాంగణాన్ని నిర్వాహకులు అత్యంత సుందరంగా, ఒక ఆధ్యాత్మిక క్షేత్రాన్ని తలపించేలా తీర్చిదిద్దారు. రంగురంగుల విద్యుత్ కాంతులు, సంప్రదాయ బద్ధమైన అరటి తోరణాలు, వివిధ రకాల పుష్పాలతో వేదికను శబరిమల సన్నిధానంలా అలంకరించారు. వేలాది దీపాల వెలుగులతో మైదానం జిగేలుమంటూ భక్తి భావాలను పంచింది.
పడిపూజలో భాగంగా 18 మెట్లను పదునెట్టాంబడి ప్రత్యేకంగా అలంకరించి, నెయ్యి దీపాలను వెలిగించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు, రుద్రా భిషేకాలు, కర్పూర హారతులు నిర్వహించారు. అయ్యప్ప భజనలు, కీర్తనలతో భక్తు లు పారవశ్యంలో మునిగిపోయారు.
కాశీ పండితుల రాకతో విశేష శోభ
ఈ మహా ఉత్సవానికి ఉత్తర భారతదేశంలోని పవిత్ర పుణ్యక్షేత్రం వారణాసి కాశీ నుంచి విచ్చేసిన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవాలయ ప్రధాన అర్చకులు శ్రీకాంత్ మిశ్రా హాజరవడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కాశీ క్షేత్రం నుంచి వచ్చిన అర్చకుల చేతుల మీదుగా, వారి వేదమంత్రాల నడు మ హైదరాబాద్‌లో అయ్యప్ప పడిపూజ జరగడం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేశారు. వారి ఆశీర్వచనాలు తీసుకోవడానికి భక్తులు పోటీపడ్డారు. భక్తి, శ్రద్ధ, సంప్రదాయాలకు ప్రతీకగా ఈ పడిపూజ విజయవంతంగా ముగిసింది.
ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు ఎన్. రామచంద్ర రావు, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ ఎన్. రామచందర్ రావు, మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యా దవ్, కృష్ణ యాదవ్, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ, ఎమ్మెల్యేలు పైడి రాకేష్ రెడ్డి, పాల్వాయి హరీష్, పాయల్ శంకర్, రామారావు, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్క కొమురయ్య, ఏవీఎన్ రెడ్డి, ముఖ్య నేతలు.. బీజేపీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శులు గౌతమ్ రావు, వేముల అశోక్, హైదరాబాద్-, సికింద్రాబాద్ జిల్లాల అధ్యక్షులు లంకల దీపక్ రెడ్డి, భరత్ గౌడ్ తో పా టు నగరంలోని పలువురు కార్పొరేటర్లు, డివిజన్ నాయకులు పాల్గొన్నారు.
మహా ప్రసాద వితరణ
పూజా కార్యక్రమం అనంతరం భక్తులకు భారీ ఎత్తున మహా ప్రసాద వితరణ అన్నదా నం జరిగింది. ఈ కార్యక్రమానికి వేలాదిగా భక్తులు తరలిరావడంతో నారాయణగూడ పరిసరాల్లో పండుగ వాతావరణం నెలకొం ది. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.
మానవాళికి సకల శుభాలు కలగాలి : కేంద్రమంత్రి
హరిహర పుత్రుడైన అయ్యప్ప స్వామి దివ్య ఆశీస్సులతో మానవాళికి సకల శుభాలు కలగాలని కోరుకుంటున్నానని కేం ద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమ నిర్వాహకులు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి సంప్రదాయ వస్త్రధారణలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి పల్లకీ సేవలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. భారతీయ సంస్కృతి భక్తి భావనతో ముడి పది ఉందని, సనాతన ధర్మానికి ఇది మూలం అని పేర్కొన్నారు.
దేశం కోసం ధర్మం కోసం దేశ ప్రజల సుఖ సంతోషాల కోసం ఆ అయ్యప్ప స్వామిని ప్రార్థించమని అందుకే ఈ పది పూజ కార్క్యక్రమాన్ని 25 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణలో రానున్న రోజుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని, అందుకు ఇటీవల నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతం పెరగడమే నిదర్శనమని అన్నారు. అందరూ బాగుండాలి.. అందులో మనం ఉండాలని భగవంతుడిని పార్థించామని తెలిపారు. సనాతన ధర్మ పరిరక్షణకు, సమాజ హితానికి అందరూ భక్తి మార్గంలో నడవాలని కేంద్రమంత్రి ఆకాంక్షించారు.
పడిపూజలో సీఎల్ రాజం దంపతులు
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మహా పడిపూజ కార్యక్రమంలో విజయ క్రాంతి, మెట్రో ఇండియా చైర్మన్ సీఎల్ రాజం దంపతులు పాల్గొన్నారు. చైర్మన్ రాజం ఆయన భార్య విజయలు అయ్యప్ప స్వామిని దర్శించుకోగా అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. వారిని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దంపతులు సాదరంగా ఆహ్వానించి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి దంపతులను రాజం దంపతులు సన్మానించి వస్త్రాలు అందజేశారు. అనంతరం కిషన్‌రెడ్డి దంపతులతో పాటు రాజం దంపతులు కలిసి అయ్యప్ప స్వాములకు దుప్పట్లు అందజేశారు.