22-12-2025 02:29:54 AM
హైదరాబాద్, డిసెంబర్ 21 (విజయక్రాంతి): ‘గోదావరిపై ఏపీలో సీఎం చంద్రబాబు నల్లమల సాగర్ పేరిట జల దోపిడీ చేస్తున్నా రాష్ట్రప్రభుత్వం నుంచి స్పందన లేదు. కృష్ణా జల దోపిడీపైనా చప్పుడు లేదు. ఎవరి ప్రయోజనాల కోసం రాష్ట్రప్రభుత్వం పనిచేస్తున్నది? జలాల విషయంలో రాష్ట్రం సాగునీటి హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత దుర్మార్గంగా జల దోపీడీ జరుగుతంటే బీఆర్‌ఎస్ మౌనంగా ఉండబోదు. మహబూబ్‌నగర్ జిల్లాలో 308 కిలో మీటర్ల కృష్ణా పారుతుంది.
గత ప్రతిపాదిత ప్రాజెక్టుల ప్రకారం 174 టీఎంసీలు ఈ జిల్లాకు రావాల్సి ఉన్నప్పటికీ.. అలా జరగడం లేదు. ఏపీ ఏర్పా టుతో మహబూబ్‌నగర్ జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగింది. ఇప్పటివరకు జరిగిన అన్యాయాలపై పోరాడతాం. నేను వస్తా. ఒక్కొక్కరి తోలుతీస్తా’ అని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ హెచ్చరికలు చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో ఆదివారం నిర్వహించిన బీఆర్‌ఎస్ ఎల్పీ, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు మహబూబ్‌నగర్ జిల్లాను దత్తత తీసుకున్న విషయాన్ని కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇష్టమొచ్చినట్లు పునాదిరాళ్లు కూడా వేశారని, తెలంగాణకు జరు గుతున్న అన్యాయాన్ని చెప్పేందుకు జోగులాంబ నుంచి గద్వాల వర కు పాదయాత్ర చేశానని కేసీఆర్ పేర్కొన్నారు. కృష్ణా నది పారే జిల్లాలో గంజి కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన దుస్థితి ఉండేదని అన్నారు.
ప్రతిపాదిత ప్రాజెక్టులు మార్చొద్దని ఎస్‌ఆర్సీ స్పష్టంగా చెప్పిందని, పాలమూరు ఎత్తిపోతలు కొత్త ప్రాజె క్ట్ కాదని వివరించారు. గతంలోనే నీటి కేటాయింపులు జరిగాయని, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌ను కలిసి చాలాసార్లు విజ్ఞప్తి చేశామని కేసీఆర్ చెప్పారు. ఈ ప్రాంతం నిర్లక్ష్యానికి గురైందని బచావత్ ట్రిబ్యునల్ ప్రకటించిందని, సుమోటోగా జూరాల ప్రాజెక్టుకు బచావత్ నీళ్లు కేటాయించారని పేర్కొన్నారు. ‘కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు కలిసి తెలంగాణకు ద్రోహం చేస్తున్నాయి.. కాంగ్రెస్ ప్రభుత్వానికి రెండేళ్లు సమయమిచ్చాం.
ప్రతీది గమనిస్తూ వస్తున్నాం. ఇకపై ప్రభుత్వాన్ని అడుగడునా నిలదీస్తాం. నేనే వస్తా. నిన్నటి వరకు ఒక లెక్క. ఇక నుంచి ఒక లెక్క. రాష్ట్రంలో ప్రజా ఉద్యమాలు చేపడతా ఇంట్లోకి వచ్చి దోచు కుపోతామంటే ఊరుకుంటామా? రాష్ట్రప్రభుత్వానికి ఎంతసేపు రియల్ ఎస్టేట్ దం దాలే తప్ప.. వేరే ధ్యాసే లేదు. రాష్ర్టంలో రైతులు పండించిన వడ్లు కొనే దిక్కు లేదు.. యూరియా ఇచ్చే సిస్టమ్ లేదు తెలంగాణలో ప్రభుత్వం ఉందా? నిద్రపోతుందా? ఎంతసేపు భూములు అమ్ముకుందామనే యావలోనే ఉంటే ఎలా?’ అని నిలదీశారు.
తెలంగాణలో సర్వ భ్రష్ట ప్రభుత్వం ఏలుతుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని దోచుకుని పోతుంటే చూస్తూ ఊరుకోమని తెలిపారు. రాబోయే రెండు మూడు రోజుల్లో ఆయా జిల్లాల బీఆర్‌ఎస్ నాయకులతో సమావేశమై, అక్కడ గ్రామగ్రామాన డప్పు కొడతా మని తెలిపారు. గ్రామగ్రామాన సభలు పెడతామన్నారు. తెలంగాణ ప్రజల ప్రయోజ నాల కోసం ఎవరితోనైనా కొట్లాడతామని, భయపడబోమని తేల్చిచెప్పారు. రెండేళ్లలో రాష్ట్రప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతామని స్పష్టం చేశారు.
రెండేళ్ల నుంచి మౌనంగా ఉంటున్నామని, అన్నీ గమనిస్తూ వస్తున్నామని వెల్లడించారు. ప్రజా ప్రయోజనాల కోసం ఇక ఉద్యమంలోకి దిగుతున్నట్లు తెలిపారు. పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో గ్రామాన ఉద్యమిస్తామని, బహిరంగ సభలు పెడతామని, తాను స్వయంగా సభలకు హాజరవుతానని పేర్కొన్నారు. తెలంగాణ తెచ్చిన పార్టీగా, ప్రతిపక్షపార్టీగా బీఆర్‌ఎస్‌కు ఆ బాధ్యత ఉందని నొక్కి చెప్పారు.
అధికార పార్టీ కిరికిరి చేస్తామంటే, అడ్డగోలు మాటలు మాట్లాడుతామంటే ఇకపై నడవబోదని హెచ్చరించారు. ‘ఇప్పటివరకు ఒక లెక్క.. ఇప్పటినుంచి ఒక్క లెక్క’ అంటూ హెచ్చరించారు. ఎక్కడికక్కడ తోలు తీస్తామని, రాష్ట్రప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తామని ప్రతినబూనారు. ప్రభుత్వాన్ని నిర్వహించేందుకు కాగసరిపోయేంత సమయాన్ని ఇచ్చామని, అంశాల వారీగా బీఆర్‌ఎస్ పోరాడుతుందని స్పష్టం చేశారు.
సమైక్యాంధ్రలో పాలమూరుపై వివక్ష
పాలమూరు జిల్లాలో కృష్ణా 300 కిలోమీటర్ల మేర పారుతున్నా సమైక్యాంధ్ర ప్రదేశ్‌లో జిల్లా వివక్షకు గురైందని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పా టే తెలంగాణ పాలిట పెను శాపమైందని అభిప్రాయపడ్డారు. పాలమూరు జిల్లా కోసం గంటెడు నీళ్లు అడిగిన వారే లేరని వాపోయారు. బచావత్ ట్రిబ్యునల్ సుమోటోగా తీసుకుని జూరాల ప్రాజెక్టుకు 17 టీఎంసీ కేటాయించిందని గుర్తుచేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పాలమూరు ప్రజలు వలసలు వెళ్లేదని, ఇక్కడి నుంచి నేరుగా బొంబాయికి బస్సులు ఉండే స్థితిని గుర్తుకు తెచ్చుకున్నారు.
కర్ణాటకలోని ముంపు ప్రాంతానికి సంబంధించి కేవలం రూ.13 కోట్లు కూడా కట్టేందుకు ముందుకు రాని నాటి సీఎం చంద్రబాబు సమైక్యాంధ్రతోనే సమగ్రాభివృద్ధి నినాదం ఇచ్చేవారని గుర్తుచేశారు. అప్పుడు, తాము తీవ్రంగా మండిపడితే మోకాళ్లపై ఉరికి కర్ణాటకకు పరిహారం చెల్లించారని గుర్తుచేశారు. ఆర్డీఎస్‌పై బాంబులు పెట్టి పేల్చిన సందర్భాలూ ఉన్నాయని ఆరోపించారు. తాను మొదటిసారి అలంపూర్ నుంచి గద్వాలకు పాదయాత్ర చేసి ప్రశ్నించినట్టు గుర్తుచేశారు.
నాటి ప్రభుత్వాలు ప్రజలను ఏమార్చడం తప్పా చుక్కా నీరు ఇవ్వలేదని నిప్పులు చెరిగారు. తెలంగాణ వెనుకబడ్డ ప్రాంతం కాదు, వెనుకకు నెట్టివేయబడిన ప్రాంతమని ఎన్నోసార్లు చెప్పామని గుర్తుచేశారు. పాలమూరులో గంజి కేంద్రాలు పెట్టే స్థాయికి దిగజారడమే అక్కడి వలసలకు నిదర్శనమన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత యుద్ధప్రాతిపదికన పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులు చేశామన్నారు. నికరంగా 6.5 లక్షల ఎకరాలకు ఆయకట్టు తీసుకొచ్చామన్నారు.
పాలమూరు జిల్లాలో మిషన్ కాకతీ య ద్వారా మైనర్ ఇరిగేషన్‌ను బలోపేతం చేయడం ద్వారా మరో 1.50 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చామన్నారు. రంగారెడ్డి, నల్ల గొం డ, పాలమూరు జిల్లాల్లో కురిసే ప్రతి వర్షపు చుక్కా కృష్ణానదిలోకే పోతుందని, అందుకే మన వాటా కోసం కొట్లాడాల్సి ఉందని పేర్కొన్నారు. కృష్ణా జలాల పునః పంపిణీపై ట్రిబ్యునల్ వేయించుకోవాలని వ్యూహాత్మకంగా కొట్లాడామని గుర్తుచేశారు. 170 టీఎంసీలు తీసుకోవాలనే లక్ష్యంతో పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశామని వెల్లడించారు.
అనేక అడ్డంకులున్నప్పటికీ నికరంగా లెక్కలు తీయించడం ద్వారా మైనర్ ఇరిగేషన్ ద్వారా 45 టీఎంసీలు నష్టాన్ని గుర్తించామని తెలిపారు. ఆ గణాంకాలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించినట్టు గుర్తుచేశారు. మొత్తం 90.81 టీఎంసీలు తీసుకునే విధంగా పాలమూరు ప్రతిపాదించామన్నా రు. ప్రాజెక్టు కోసం రూ. 35 వేల కోట్లు మంజూరు చేశామని, అందులో రూ. 27 వేల కోట్లు ఖర్చు కూడా పట్టామని, దాదాపు 80 నుంచి 90 శాతం పనులు కూడా పూర్తి అయిపోయాయని స్పష్టం చేశారు.
భూములు అమ్మేయాలని చూస్తున్నారా ?
బీఆర్‌ఎస్‌కు ఓటేసే ఉద్దేశంలో ఉన్న ప్రజలను పచ్చి అబద్దాలతో మోసం చేశారని, ప్రజలకు దొంగ మాటలు చెప్పి అర్రాసు పాటలు పాడినట్టు హామీలిచ్చారని మాజీ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. పెండ్లి చేసుకునేవారు ఆగిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక చేసుకుంటే తులం బంగారం వస్తుందని చెప్పారని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ రాకముందు ఎరువుల కేంద్రాల ఎదుట చెప్పుల లైన్లు ఉండేవని, 2014 తర్వాత అవి మాయమయ్యాయని, ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది.. చెప్పులు లైన్లు వచ్చాయని దుయ్యబట్టారు.
ఇప్పుడు కొత్తగా ఒక యాప్ తీసుకొచ్చారని, ఎరువుల బస్తాలకు యాప్ ఎందుకు అని ప్రశ్నించారు. రైతు కేంద్రంగా బీఆర్‌ఎస్ పరిపాలన ఉండేదని గుర్తు చేశారు. మళ్లీ బీఆర్‌ఎస్ ప్రభుత్వమే వస్తుందని ప్రజలు చెబుతున్నారని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందా చేస్తున్నదని మండిపడ్డారు. ప్రపంచ ఫార్మా రంగానికి కేంద్రంగా హైదరాబాద్ మారిందని, ప్రపంచంలో మూడో వంతు మెడిసిన్ జీనోమ్ వ్యాలీ నుంచే సరఫరా అవుతుందని స్పష్టం చేశారు.
భవిష్యత్ ఉద్దేశంతో ఫార్మా రంగానికి వదులుకోకుండా, కాలుష్య కారకాలను తగ్గించి ప్రజలను కాపాడాలని ఫార్మా సిటీ ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. అందుకే సీనియర్ ఐఏఎస్ అధికారి శాంతికుమారి ఆధ్వర్యంలో ఒక బృందాన్ని ఆయా దేశాలకు పంపించి, పరిశీలించిన తర్వాతనే ఫార్మా సిటీ నిర్ణయం తీసుకున్నామని గుర్తుచేసుకున్నారు. దీనిలో భాగంగానే తాము 20 వేల ఎకరాలు సేకరించాలని నిర్ణయించి, 14 వేల ఎకరాలు సేకరించామని తేల్చిచెప్పారు.
ఆ భూములను అమ్ముకునేందుకు చూస్తున్నారా అంటూ కేసీఆర్ ప్రశ్నించారు. ఫ్యూచర్ సిటీ ఎవరికి కావాలని, హైదరాబాద్ సిటీ మీరు పెంచారా?, ఇంతటి వైబ్రంట్ సిటీ ఎలా తయారైందని నిలదీశారు. తాము ఇంత చిల్లర పనులు చేయలేదని, ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏం చేయదలచుకున్నారని ప్రశ్నించారు. పెట్టుబడుల పేరిట ప్రజలను ఇంత వంచిస్తారా అని విమర్శించారు. నిజంగా పెట్టుబడుల వచ్చేలా కృషి చేయాలని సూచించారు. ఊరికే హైప్ క్రియేట్ చేయడం ఆత్మ వంచన, ప్రజా వంచన అవుతుదన్నారు.
మహిళలకు రూ. 2,500 దిక్కులేదని, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామంటారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ విధానాలతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గంగలో కలిసిందన్నారు. కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీ కట్టలేకపోతున్నామంటే కాగ్ చెంపలు వాయిందన్నారు. కేసీఆర్‌ను తిట్టేందుకే వాళ్ల నోరుకే మొక్కాలని పేర్కొన్నారు. మాట్లాడితే కేసీఆర్ చనిపోవాలని కోరుకోవడం, ఇంత అక్కసు ఉంటుందా అని ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో రాజీ పడబోం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిద్రపోనివ్వమని హెచ్చరించారు. టీఆర్‌ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసమని స్పష్టం చేశారు.
తెలివి తక్కువ దద్దమ్మ ప్రభుత్వం
రాజకీయంగా గెలుపోటములు, ప్రభుత్వాలు మారడం సహజమని, ఎంత తెలివి తక్కువ దద్దమ్మ ప్రభుత్వం వచ్చినా రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం చేకూర్చే ప్రాజెక్టులను కొనసాగిస్తారని మాజీ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డిలో ఒక్క తట్టెడు మట్టి తీయలేదని ధ్వజమెత్తారు. ఇక కేంద్ర ప్రభుత్వమైతే మొదటి నుంచి తెలంగాణకు శనిలా తయారైందని నిప్పులు చెరిగారు. ఏపీ సీఎం చంద్రబాబు మాటలు పట్టుకుని ప్రతి పనినీ వ్యతిరేకించారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం డీపీఆర్ వెనక్కి పంపిస్తే అఖిల పక్షాలను ఢిల్లీకి తీసుకెళ్లి ధర్నా చేయాలన్నారు.
ధాన్యం కొనుగోలు చేయకపోతేనే తాము ఢిల్లీలో ధర్నా చేసి మరీ కేంద్రంతో కొనుగోలు చేయించామని గుర్తు చేశారు. మూడు జిల్లాలకు సంబంధించిన ప్రధానమైన ప్రాజెక్టు డీపీఆర్ వెనక్కి పంపిస్తే స్పందనే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో 75 శాతం డిపెండబులిటీతో నదీ జలాల కేటాయింపులు జరగేవని, బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ దానిని 65 శాతం డిపెండబులిటీతో తీసుకోవచ్చని తీర్పు ఇచ్చిందని గుర్తుచేశారు. దీంతో తెలంగాణకు అదనంగా 60 నుంచి 70 టీఎంసీలు వస్తుందన్నారు.
మొత్తంగా 170 టీఎంసీల వరకు తీసుకోవడం ద్వారా సాగు, తాగుకు సమృద్ధి నీటి లభ్యత ఉంటుందని ఆశించామన్నారు. అలాంటి ప్రాజక్టు డీపీఆర్ వెనక్కి పంపించినా స్పందనే లేదని దెప్పిపొడిచారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు లేనప్పుడు ఇదేమీ దద్దమ్మ ప్రభుత్వమని మండిపడ్డారు. ఇంత చేతగానీ, నోరులేని ప్రభుత్వం ఉంటే ఎలా అని ప్రశ్నించారు. దీనికి తోడు తెలంగాణకు 45 టీఎంసీలకు అనుమతి ఇవ్వాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిందని, ఏ మొఖం పెట్టుకుని లేఖ రాస్తారని, ఇది ప్రభుత్వమేనా అని ప్రశ్నించారు.
బచావత్ ట్రిబ్యునల్ ద్వారా వచ్చిన 45 టీఎంసీలను ఎందుకు ఆపుతున్నారని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం నిద్ర పోతున్నదా?, రియల్ ఎస్టేట్ దందా తప్ప వేరే ధాస్య లేదా అని ప్రశ్నించారు. హిల్ట్ భూములు ఎలా అమ్మాలని, ఎంత కమీషన్ కొట్టాలని తప్ప, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేది లేదా అన్నారు. రెండేళ్ల నుంచి ఎందుకు ప్రాజెక్టులకు ఒక్క రూపాయి కూడా పెట్టలేదని ప్రశ్నించారు. మీకు ఎవరు అడ్డుపడుతున్నారని, ఎవరి ఒత్తిడి ఉందని, ఏం కుట్ర దాగి ఉందని ఆరోపించారు.
కేసీఆర్‌ను దూషించడమే వారి విధానం
తనను దూషించడం, అవమానించడమే ఇప్పుడు ప్రభుత్వ విధా నంగా మారిందని మాజీ సీఎం కేసీఆర్ విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సా ధించామని, ప్రభుత్వ వ్యతిరేకత స్ప ష్టంగా కనిపించిందన్నారు. బీఆర్‌ఎస్‌ఎల్పీ, కార్యవర్గ సమావేశం సంద ర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికలు ఐతే ఇంకా బీఆర్‌ఎస్ సత్తా తెలిసేదని, స్థానిక సంస్థల ఎన్నికల్లో మన పార్టీ మంచి రిజలట్స్ సాధించిందన్నారు. పార్టీని గెలిపించడం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో గర్వంతో ఎగిరే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ప్రజలు బుద్ధి చెప్పారని వెల్లడించారు. మనం గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు ఇలాంటి అహంకార పూరిత హింస ప్రయత్నాలు చేయలేదని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎట్లా ప్రతిపక్షాలతో వ్యవహరించాలో నేర్పుతున్న దని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల్లో ఒక కొత్త పాలసీ తేలేదని, తీసుకువచ్చిన పాలసీ అంతా భూమి రియల్ ఎస్టేట్ కు సంబంధించిందేనని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తది పథకం ఒకటి ప్రకటించకపోగా, ఉన్నవాటిని నిలిపివేసిందని మండిప డ్డారు.
ప్రాజెక్ట్ పనులు ఎందుకు పూ ర్తి చేయడం లేదని, రైతులను రాచిరంపాన పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెక్‌డ్యాంలను బాంబ్ లు పెట్టి పేలుస్తారా, బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూల్చిన వాళ్లు పాతాళ లోకంలో ఉన్నా పట్టుకొస్తామని హెచ్చరించారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రా రంభించాలని సూచించారు. జనవరి రెండవ వారంలో మహబూబ్‌నగర్‌లో మొదటి సభ, చేవెళ్లలో రెండవ సభ, తర్వాత నల్లగొండలో మూడో సభ నిర్వహించాలని నిర్ణయించారు.