22-12-2025 02:22:44 AM

హైదరాబాద్, డిసెంబర్ 21 (విజయక్రాంతి) : తెలంగాణకు నీటి వాటాలో ఉమ్మడి రాష్ట్రంలో కంటే బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలోనే అన్యాయం జరిగిందని.. కేసీఆరే ద్రోహి అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. కృష్ణాబేసిన్‌లో 811టీఎంసీల నికర జలాలు ఉంటే.. తెలంగాణకు కేవలం 299 టీఎంసీల నీళ్లు చాలని సంతకాలు చేసి.. శాశ్వ తంగా హక్కులు రాసిచ్చి మరణశాస నం లిఖించారని ధ్వజమెత్తారు. కృష్ణా జాలాల్లో తెలంగాణకు 71 శాతం వాటా కావాలని తాము కొట్లాడుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు.
రాష్ట్రాన్ని దివాళా తీయించి కేసీఆర్, కేటీఆర్ ఆర్థిక ఉగ్రవాదులుగా మారారని ఆరోపించారు. ఆదివారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డి మీడియా తో చిట్ చాట్ నిర్వహించారు. కృష్ణా జలా ల విషయంలో కేసీఆర్ తీరువల్ల 3 జిల్లాలకు, రాజకీయంగా భిక్షపెట్టిన ప్రాంతానికి ద్రోహం చేశారని విమర్శించారు. గోదావరి, కృష్ణా ప్రాజెక్టులపై జనవరి 2నుంచి అసెంబ్లీలో చర్చిద్దామని, అందుకు కేసీఆర్ శాసనసభకు రావాలని సీఎం కోరారు.
గతంలో జరిగిన అంశాలు, భవిష్యత్‌లో తీసుకునే నిర్ణయాలపై చర్చిద్దామని, ప్రతిపక్ష నేతగా కేసీఆర్ మంచి సూచనలు చేస్తే ప్రభుత్వం స్వీకరిస్తుందన్నారు. కేసీఆర్ అనుభవానికి ట్రెజరీ బెంచ్‌నుంచి ఎలాంటి అవమానం, భంగం కలగకుండా చూసే బాధ్యత తనదేనన్నారు. సభలోకి రాకుండా పారిపోయి సభలు పెట్టడాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.
కలుగులో ఎలుకలాగ బయటికి..
‘కేసీఆర్ రెండేళ్ల తర్వాత కలుగులో ఎలుకలాగ బయటికి వచ్చాడు. పార్లమెం ట్ ఎన్నికలు, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు.. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు వాత పెట్టిన తర్వాత కనువిప్పు కలగలేదు. చెప్పిన అబద్ధాలనే చెప్పి చెప్పి.. అబద్ధాలనే పెట్టుబడిగా మార్చుకున్నారు. ఎలాంటి జంకు లేకుం డా రంకు మాటలు మాట్లాడిండు. కనీసం ఆయన వయసుకు తగ్గట్టుగా మాట్లాడలేదు’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఇప్పటికైనా బయటికి రావడం చాలా సంతోషమన్నారు.
పదేళ్లలో ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు..
పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టుకు జూరాల వద్ద నుంచి కాకుండా శ్రీశైలం నుంచి నీటిని తీసుకురావడానికి చేసిన ప్రయత్నంతో తెలంగాణకు కేసీఆర్ రెండో ద్రోహం చేసి.. ఆంధ్రప్రదేశ్ జలదోపిడీకి కేసీఆరే రాజమార్గం వేశారని సీఎం ఆరోపిం చారు. గోదావరి, కృప్ణా జలాలను ఏపీకి తీసుకెళ్లాలని చంద్రబాబు, జగన్‌కు కేసీఆర్ క్లాస్‌లు చెప్పారు. కేసీఆర్ నిర్ణయాల వల్లే ఏపీ ప్రభుత్వం రాయలసీమకు దర్జాగా నీళ్లు తీసుకెళ్లిందన్నారు. కాంగ్రెస్ హయాంలో మొదలు పెట్టిన పాలమూరు- రంగారెడ్డి, నెట్టెంపాడు, బీమా, కల్వకుర్తి, డిండి ప్రాజెక్టు తదితర ప్రాజెక్టులను పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఎందుకు పూర్తి చేయలేదని సీఎం రేవంత్‌రెడ్డి నిలదీశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ. 6,800 కోట్ల వరకు ఖర్చు చేసి ఆ ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు.
తెలంగాణను నడిబాజారులో దివాళా తీయించారు
‘బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని రూ. 8 లక్షల కోట్ల అప్పులు చేసి.. తెలంగాణను నడి బజారులో దివాళా తీయించారు.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేశారు. మేం ఒక్కొక్కటి సరిదిద్దుతూ గాడి లో పెడుతున్నాం. కేసీఆర్ సర్కార్ నిర్వాకం వల్లే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్ కేంద్రం వెనక్కి పంపింది. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా కనీసం సగం కూడా అడగలేదు. పాలమూరు- రంగారెడ్డిపై కేసులు వేసింది.. బీఆర్‌ఎస్ నాయకుడు హర్షవర్దన్‌రెడ్డినే. ఆయన్ను కేసీఆర్ పార్టీలో చేర్చుకుని బీఆర్‌ఎస్ టికెట్ ఇచ్చిండు.
తెలంగాణకు నీళ్ల కోసం సుప్రీంకోర్టు, ట్రిబ్యునల్స్‌లో తమ వాదనలు వినిపిస్తున్నాం. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డినే స్వయంగా ఢిల్లీకి వెళ్లి లాయర్లతో మాట్లాడుతున్నాడు ’ అని సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు. కేసీఆర్ హయాం లో తెచ్చిన అప్పులకు .. అసలు, మిత్తీ తమ ప్రభుత్వం చెల్లిస్తోందన్నారు. రూ. 26వేల కోట్ల వరకు 11.9 శాతం ఉన్న వడ్డీని కేం ద్రంతో చర్చించి 7.25 శాతానికి తగ్గించామని, దీంతో ప్రభుత్వానికి ప్రతి ఏటా రూ. 4 వేల కోట్ల వరకు వెసులుబాటు లభించిందన్నారు. రాష్ట్రంలో నెలకొన్న వివిధ సమస్యలపై చర్చించి నిర్ణయం తీసుకునేందుకు సోమవారం మంత్రులతో సమావేశం ఏర్పాటు చేసినట్లు సీఎం తెలిపారు.
కేసీఆర్‌ను ఫామ్‌హౌస్‌లో నిర్బంధించారు..
‘కేసీఆర్‌ను కొడుకు కేటీఆర్, అల్లుడు హరీశ్‌రావు బయటికి రానీయడం లేదు. ఫామ్‌హౌస్‌లో నిర్బంధించారు. కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నా. కానీ కొడుకు, అల్లుడు మాత్రం కేసీఆర్ కుర్చీ కోసం కుస్తీ పడుతు న్నారు. అయితే కేసీఆర్ ఇప్పుడు క్రియాశీలక రాజకీయాల్లో లేడు. ఆయన చట్టసభలకు వచ్చినప్పుడే క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నట్లు. కేసీఆర్ ఇంట్లో పంచాయితీ కోతుల పంచాయితీగా ఉంది. హరీశ్‌రావు బీఆర్‌ఎస్‌ను విడిచి బయటికి రాడు.. ఎందుకంటే ఆ పార్టీ పేరుమీద రూ. 5వేల కోట్లు ఉన్నాయి. వాటిని ఎలా లాక్కోవాలని హరీశ్‌రావు చూ స్తున్నాడు ’ అని సీఎం ఎద్దేవా చేశారు.
తమ ప్రభుత్వం కోటి మంది మహిళలకు సారె, చీర పెట్టి గౌరవిస్తుందని, కవితకు సారె, చీర పెట్టాల్సి వస్తుందనే బీఆర్‌ఎస్ నుంచి బయటకు పంపినట్లుగా ఉందన్నారు. తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి అమలు చేస్తున్నామని, కేసీఆర్ ఇచ్చిన హామీల్లో దళిత సీఎం, దళితులకు 3 ఎకరాల భూ పంపిణీ లాంటివి ఎందుకు అమ లు చేయలేదని సీఎం రేవంత్‌రెడ్డి నిలదీశారు. యూరియా విషయంలో టెక్నాలజీ ఉపయోగిస్తే తప్పేంటో చెప్పాలన్నారు. గతం కంటే వరి ధాన్యం ఉత్పత్తి భారీగా పెరిగిందని సీఎం వివరించారు.