10-12-2025 02:23:40 AM
ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులకు గాయాలు..
కీసర, డిసెంబర్ 9 (విజయక్రాంతి): కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారం చౌరస్తాలో ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చీర్యల్కు చెందిన ’డివైన్ గ్రేస్ స్కూల్’ బస్సు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో ఇద్దరు విద్యార్థులు మాత్రమే ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు.
అయితే, ఈ ప్రమాదానికి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మరోవైపు, విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు. స్కూల్ బస్సు నడుపుతున్న డ్రైవర్కు హెవీ వెహికల్ లైసెన్స్ లేదని, యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్న స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.