calender_icon.png 24 January, 2026 | 10:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు ఉండగానే పాఠశాలకు తాళం

24-01-2026 09:14:30 PM

కంగ్టి,(విజయక్రాంతి): మండల పరిధిలోని రాంతిర్త్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న బొజ్జ నాయక్ తండా ప్రాథమిక పాఠశాలకు  తాండవాసి కిషన్ నాయక్ అనే వ్యక్తి పాఠశాలకు తాళం వేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం మధ్యాహ్నం పాఠశాలకు తాళం వేసి విద్యార్థులకు బయటకు పంపించినట్లు సమాచారం. ఈ పాఠశాలలో మొత్తం తొమ్మిదిమంది విద్యార్థులు ఉండగా తాళం వేసిన సమయంలో ఏడు మంది విద్యార్థులు స్కూల్లోనే ఉన్నట్టు తెలిసింది.

శనివారం పాఠశాలకు తాళం అలాగే ఉండడంతో  విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేస్తున్నారు. తాళం వేసి ఉండటంతో గమనించిన ఉపాధ్యాయుడు విద్యార్థులకు పాఠశాల ఆవరణలోనే కూర్చోబెట్టి బోధించారన్నారు. పాఠశాల నిర్మించి దాదాపు 25 సంవత్సరాల పైనే అవుతుండగా ఈ పాఠశాల  నిర్మించిన స్థలం తనదే అంటూ కిషన్ నాయక్ తాళం వేసినట్టు సమాచారం. అయితే ఈ ఘటన వెనుక తండాలో ఇతర వ్యక్తుల గొడవ ప్రభావం కూడా ఉండొచ్చని స్థానికంగా చర్చ నడుస్తోంది.

 ఎంఈఓ వివరణ

 ఈ ఘటనపై ఎంఈఓ రహీముద్దీన్ ను వివరణ కోరగా. ఇది ప్రభుత్వ స్థలమేనని స్పష్టం చేశారు. తాళం వేసిన వ్యక్తిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.