23-07-2025 12:00:00 AM
ఇల్లందు టౌన్, జులై22, (విజయక్రాంతి):సీజనల్ వ్యాధులను అరికట్టాలని, వర్షాకాలంలో విష జ్వరాలు పల్లెల్లో విజృంభిస్తున్నటువంటి తరుణంలో ప్రభుత్వ అధికారులు తక్షణమే పల్లెలపై దృష్టి సారించాలని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర నాయకురాలు చంద్ర అరుణ అ న్నారు.
మంగళవారం స్తానిక ఎల్లన్న విజ్ఞాన కేంద్రంలో ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు ఎదలపల్లి సావిత్రి అధ్యక్షతన జరిగిన ముఖ్య కార్యకర్తల జనరల్ బాడీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సీజనల్ వ్యాధులకు సరిపడా మందులను, పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ప్రజలకు డాక్టర్లు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు.
సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు ఏజెన్సీ గ్రామాలలో పేద ప్రజలకు ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని అధికారులకు విజ్ఞప్తి చేశారు. అనంతరం పలు అంశాలపై తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించారు. ఈ సమావేశంలో ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా నాయకురాలు కోరం ముత్తక్క, పిల్లి రమ తదితరులు పాల్గొన్నారు.