25-07-2025 01:06:55 AM
లండన్, జూలై 24: భారత్, ఇంగ్లండ్ (యూకే)ల మధ్య చారిత్రాత్మక అతిపెద్ద ‘స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కుదిరింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ సమక్షంలో ఇరుదేశాల వాణిజ్య మంత్రులు పీయూష్ గోయల్, జొనాథన్ రేనాల్డ్స్ ఒప్పందంపై సంతకాలు చేశారు.
దీనిద్వారా భారత్, ఇంగ్లండ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం కావడంతో పాటు ఇరు దేశాల మధ్య ఏటా 34 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతుందని అంచనా. 2020లో యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి ఇంగ్లండ్ బయటకు వచ్చిన తర్వాత ఆ దేశం చేసుకున్న అతిపెద్ద ఒప్పందం ఇదే. ఒప్పందం అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ.. భారత్, ఇంగ్లండ్ భాగ స్వామ్యంలో విజన్-2035 లక్ష్యంగా సాగుతున్నామన్నారు.
చాలా ఏళ్ల కృషి తర్వాత భారత్, బ్రిటన్ మధ్య సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందంపై సంతకాలు జరగడం సంతోషకరమన్నారు. ఏఐ, సైబర్ సెక్యూరిటీ అంశాల్లో ఇరుదేశాలు ముందుకు సాగుతాయన్నారు. బ్రిటన్, భారత్ భాగస్వామ్యం కొత్త పుంతలు తొక్కనుందన్నారు. ఆరు బ్రిటన్ యూనివర్సిటీలు భారత్‌లో క్యాంపస్‌లు ఏర్పాటు చేస్తున్నాయి.
పహల్గాం ఘట ను ఖండించిన బ్రిటన్ ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన మోదీ ఉగ్రవాద విషయంలో ద్వంద్వ ప్రమాణాలకు అవకాశమే లేదన్నారు. అహ్మదాబాద్ విమాన దుర్ఘటన మృ తుల్లో బ్రిటన్‌లోని ఎన్నారైలు ఉన్నారని.. మృతులకు మరోసారి సంతాపం ప్రకటిస్తున్నట్టు పేర్కొన్నారు. అంతకుముందు రెండు రోజుల పర్యటనలో భాగంగా మోదీ గురువారం ఇంగ్లండ్‌కు చేరుకున్నారు. లండన్ వి మానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది.
మాకు ఇదే అతిపెద్ద ఒప్పందం: స్టార్మర్
ఈయూ నుంచి వైదొలిగిన తర్వాత ఇం గ్లండ్ చేసుకున్న అతిపెద్ద, ఆర్థికంగా అత్యంత ముఖ్యమైన వాణిజ్య ఒప్పందం ఇదేనని ఆ దేశ ప్రధాని కీర్ స్టార్మర్ పేర్కొన్నారు. భారతదేశం ఎఫ్‌టీఏపై సంతకం చేయడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విస్తృత పరస్పర సుంకాల బెదిరింపులు, ప్రపంచ అనిశ్చితుల మధ్య యూకే వ్యాపారానికి తెరిచి ఉందనే స్పష్టమైన సందేశాన్ని పంపుతోందన్నారు. ఈ ఒప్పందం యూకేలో ఒప్పందాలు, పెట్టుబడులు, వృద్ధికి దోహదపడుతుందని చెప్పారు.
భారత్ అందిస్తున్న తగ్గింపులు..
1) యూకే నుంచి దిగుమతి చేసుకునే స్కాచ్, విస్కీపై ఉన్న 150 శాతం సుంకం 75 శాతానికి తగ్గింపు
౨) యూకేలో తయారైన వాహనాలపై ప్రస్తుతం ఉన్న వంద శాతానికి పైగా సుంకాన్ని కోటా విధానంలో 10 శాతానికి తగ్గింపు
౩) కాస్మెటిక్స్, మెడికల్ పరికరాలు, చాక్లెట్లు, బిస్కెట్లు, సాల్మన్ చేపలపై పన్ను తగ్గింపుకు నిర్ణయం
౪) యూకే ఉత్పత్తులపై సగటు సుంకం 15 నుంచి 3 శాతానికి తగ్గింపు
ఇంగ్లండ్ అందిస్తున్న తగ్గింపులు..
1) ఒప్పందంలో భాగంగా భారత్ నుంచి యూకేకు ఎగుమతయ్యే 99 శాతం వస్తువులపై ఎలాంటి సుంకాలు విధించొద్దని నిర్ణయం. దీనివల్ల జనరిక్ మందులు, టెక్స్‌టైల్స్, లెదర్, పాద రక్షలు, క్రీడా వస్తువులు, సముద్ర ఉత్పత్తులు, ఆభరణాలు, ఇంజినీరింగ్ వస్తువులు, ఆటో పరికరాలు, సేంద్రీయ రసాయనాల రంగాలకు కలిసి రానుంది.
2) భారతీయ రైతులకు లాభాల పంట. పండ్లు, కూరగాయలు, మసాలాలు, ధా న్యాల ఎగుమతులు పెరిగే అవకాశం.
౩) ప్రతి ఏటా 60వేల మంది ఐటీ నిపుణులకు ప్రయోజనం. ప్రీలాన్సర్లు, చెఫ్‌లు, సంగీతకారులు, యోగా బోధకులకు విస్తృత అవకాశాలు
4) ఇంగ్లండ్‌లో ఉన్న భారతీయ నిపుణులు మూడేళ్ల పాటు సామాజిక భద్రతకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు
రెండు దేశాల మధ్య పెరగనున్న వ్యాపారం..
తాజా ట్రేడ్ డీల్ ప్రకారం 99 శాతం భా రతీయ వస్తువులు బ్రిటన్ మార్కెట్‌లో ఎ లాంటి సుంకాలు లేకుండా దొరకనున్నాయి. అదే సమయంలో ఇంగ్లండ్ ఉత్పత్తులకు కూడా భారతదేశ మార్కెట్‌లోకి విస్తృత యాక్సెస్ దొరుకుతుంది. ఈ ఒప్పందంతో రెండు దేశాలు 2023 నాటికి వాణిజ్య విలు వ రెట్టింపు చేసి 120 బిలియన్ డాలర్లకు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. యూకేకి భారతీయ కంపెనీలు ఉద్యోగుల్ని పంపడం సులభమవుతోంది. ప్రస్తుతం యూకే.. భారత్‌లో అతిపెద్ద పెట్టుబడి దారు. మొత్తం పెట్టుబడులు దాదాపు 36 బిలియన్ డాలర్లు.
ఒప్పందం ద్వారా భారత్‌లో లాభపడే కంపెనీలు..
* టెక్స్‌టైల్ అండ్ అపెరల్- వెల్‌స్పన్, అరవింద్
* ఫుట్‌వేర్- బాటా ఇండియా, రిలాక్సో
* ఆటో కాంపొనెన్ట్స్ అండ్ ఈవీ- టాటా మోటార్స్, మహీంద్రా ఎలక్ట్రిక్
* ఇంజనీరింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్- భారత్ ఫోర్జ్
* వీటితో పాటు జ్యువెల్లరీ, స్పోర్ట్స్ పరికరాలు, ఫర్నిచర్, కెమికల్స్, మెషినరీ ఫ్యాక్టరీలు లాభపడనున్నాయి.