28-12-2025 01:19:45 AM
రాబోయే అసెంబ్లీలో చట్టంపై ఆర్డినెన్స్ తేవాలి: దాసు సురేశ్
ఇందిరాపార్క్ ధర్నా చౌక్లో బహుజన ప్రజాశక్తి, బీసీ రాజ్యాధికార సమితి నిరసన
హైదరాబాద్, సిటీబ్యూరో డిసెంబర్ 27 (విజయక్రాంతి): కార్పొరేట్ విద్యా, వైద్య సంస్థలు ప్రజల కష్టార్జితాన్ని, ప్రజా ధనాన్ని నిలువునా దోచుకుంటున్నాయి. పేద విద్యార్థులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తున్నాయి. విద్యా హక్కు చట్టం-2009 ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లు పేదలకు కేటాయించాల్సి ఉ న్నా.. ఆ నిబంధన కాగితాలకే పరిమితమైం ది.. అని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో విద్యా హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద బహుజన ప్రజాశక్తి ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు.
అధికారులు చోద్యం చూస్తున్నారు. బహుజన ప్రజాశక్తి రాష్ట్ర కన్వీనర్ నల్లా లక్ష్మణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో దాసు సురేశ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్పొరేట్ పాఠశాలలు నిబంధనలను తుంగలో తొక్కుతున్నా విద్యాశాఖ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. చట్టం అమలు కాకపోవడం వల్ల సామాన్య ప్రజలు, బడుగు బలహీన వర్గాలు నాణ్యమైన విద్యకు దూరమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యా, వైద్యం అనేవి సేవా రంగాలుగా ఉండాల్సింది పోయి, నేడు పూర్తి స్థాయి వ్యాపారంగా మారాయని విమర్శించారు.
అసెంబ్లీలో తీర్మానం చేయాలి..
విద్యా హక్కు చట్టాన్ని తెలంగాణలో విధి గా అమలు చేసేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని దాసు సురేశ్ డిమాండ్ చేశారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశంపై చర్చించి, చట్టం అమలుకు అవసరమైన స్పష్టమైన తీర్మానాన్ని లేదా ఆర్డి నెన్సు తీసుకురావాలి. జీవో రూపంలోనైనా సరే పేద విద్యార్థులకు న్యాయం చే యాలని ప్రభుత్వాన్ని కోరారు. లేనిపక్షంలో పేద తల్లిదండ్రుల పక్షాన ఉద్యమాన్ని ఉధృతం చేస్తా మని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బహుజన ప్రజాశక్తి, బీసీ రాజ్యాధికార సమితి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. హైదరాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల నుంచి విద్యార్థుల తల్లిదండ్రులు తరలివచ్చి తమ ఆవేదనను వెలిబుచ్చారు. బీసీ రాజ్యాధికార సమితి సీఈఓ సరస్వతి, సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షురాలు కొత్తూరి శారద, మొక్కపల్లి లక్ష్మీ తదితరులు పాల్గొని మద్దతు తెలిపారు.