calender_icon.png 4 May, 2025 | 9:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రతా వైఫల్యమే!

27-04-2025 12:00:00 AM

పహల్గాం ఉగ్రదాడి ఘటన మన దేశ భద్రతా వైఫల్యాన్ని మరోసారి ఎత్తి చూపడంతోపాటు సరిహద్దుల్లో ఉగ్రవాదుల చొర బాటును పూర్తిస్థాయిలో నియంత్రించడానికి చేపట్టిన చర్యల్లో వేగం పెంచాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నది. దేశంలోకి చొరబడి భారత్‌ను విచ్ఛిన్నం చేయడానికి ఉగ్రవాదులు కాచుకుని కూర్చుంటారు. దేశంలోకి ప్రవేశించడానికి ఉన్న ఏ ఒక్క అవకాశాన్నీ వాళ్లు ఎట్టి పరిస్థితుల్లో వదులుకోరు. పహల్గాం ఘటనలో భద్రతా బలగాలు, స్థానిక యంత్రాంగం మధ్య కొరవడిన సమన్వ య లోపం ఉగ్రదాడికి ప్రధాన కారణంగా తెలుస్తున్నది.

కశ్మీర్‌లోని బైసరన్ లోయ పర్యాటకులకు స్వర్గధామం. మారుమూల ప్రాంతంలో ఉం డటం వల్ల ఇక్కడ పర్యటించేందుకు పర్యాటకులకు నిర్ధిష్ట సమయాల్లోనే అనుమతి ఉంటుంది. సాధారణంగా అమర్‌నాథ్ యాత్ర సమయంలో ఈ ప్రాంతంలో పర్యటించేందుకు అనుమతి ఉంటుందనే విషయాన్ని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఈ ప్రాంతానికి పర్యాటకుల తాకిడి మొదలు కావడంతోనే ఆ సమాచారాన్ని స్థానిక హోటల్ యజమానులు, గైడ్లు, టూర్ ఆపరేటర్లు పోలీసులకు అందించా ల్సి ఉంటుంది. అదే విధంగా పోలీసులు ఈ సమాచారాన్ని భద్రతా బలగాలకు చేరవేయాల్సి ఉంటుంది.

కానీ, ఈ ప్రక్రియంతా అక్కడ జరగలేదని పరిస్థితులనుబట్టి అర్థమవుతున్నది. మిగిలిన ప్రాంతాల గురించి పక్కన పెడితే కశ్మీర్‌లో ఓ పదిమంది కలిసి నడుచుకుంటూ వెళ్తేనే సెక్యూరిటీ అధికారులు వారి కదలికలను నిశితంగా గమనిస్తారు. అలాంటిది ఉగ్రమూక ఏకంగా ఆర్మీ దుస్తుల్లో వచ్చి మరీ పర్యాటకులపై కాల్పులు జరిపిందంటే అక్కడ భద్రత వైఫల్యం పరాకాష్టకు చేరిందని స్పష్టంగా తెలుస్తున్నది. పటిష్ట భద్రత ఉన్నప్పటికీ పఠాన్‌కోట్, పుల్వామా, ఉరీ దాడులు జరిగాయి. 

ఈ తరుణంలో అసలు భద్రతను పూర్తిగా గాలి కొదిలేసిన పహల్గాంను ఉగ్రవాదులు అవకాశంగా భావించారనే వాదన వినిపిస్తున్నది. జమ్ముకశ్మీర్‌లో ఎన్నికలు జరిగి ప్రభుత్వం ఏర్పాటవడం, ఆ ప్రాంతంలో పర్యాట కుల తాకిడి పెరిగి ఆర్థికంగా కాస్త మెరుగు పడటం వంటి అంశాలు సెక్యూరిటీ అలసత్వానికి కారణమైనట్టు తెలుస్తున్నది. అసలే పాకిస్థాన్ సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. పీఓకేలోని ప్రజలు అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు.

మరోవైపు బలోచిస్థాన్ రెబల్స్ పాక్ ప్రభుత్వానికి పంటికింద రాయిలా మారారు. ఇదే సమయంలో కశ్మీర్ అభివృద్ధి పథంలో పయనించడం పాక్‌కు కంటగింపుగా మారింది. దీంతో కశ్మీర్ అభివృద్ధిని విచ్ఛిన్నం చేయడంతోపాటు తమ వైఫల్యాల నుంచి ప్రపంచం దృష్టిని మరల్చడానికి సెక్యూరిటీ లోపాన్ని అదునుగా తీసుకుని పహల్గాం దాడికి ఉగ్రవాదులను పాక్ పురిగొల్పినట్టు అర్థమవుతున్నది.

అందువల్ల దేశంలో మరోసారి ఇటువంటి ఉగ్రదాడులు జర గకుండా ఉండేందుకు ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలి. పఠాన్‌కోట్ ఘటన తర్వాత సరిహద్దుల వెంట ఉగ్రవాదుల ప్రవేశాన్ని నియంత్రించడానికి అధునాతన నిఘా వ్యవస్థతో కూడిన సరిహద్దు ఫెన్సింగ్‌ను అప్ గ్రేడ్ చేయాలని ప్రభుత్వం భావించింది. కానీ, ఇప్పటి వరకు ఆ పనులు పూర్తి కాలేదు. దీన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయడంతోపాటు డ్రోన్లద్వారా నేపాల్, పంజాబ్ సరిహద్దు మీదుగా పాక్‌నుంచి భారత్‌లోకి సరఫరా అవుతున్న మారణాయుధాలను ప్రభుత్వం సమర్థవంతంగా అడ్డుకోవాలి. అప్పుడే పహల్గాం వంటి ఘటనలు పునరావృతం కావు.