04-05-2025 08:40:04 PM
నిమిషం ఆలస్యమైనా అనుమతించని అధికారులు..
ఏడుస్తూ వెనక్కి తిరిగిన పలువురు విద్యార్థులు..
మహబూబాబాద్ (విజయక్రాంతి): నీట్ ప్రవేశ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నిర్వహించిన నీట్ పరీక్షకు 494 మంది హాజరైనట్టు అధికారులు వెల్లడించారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు విద్యార్థులను అనుమతించారు. ఆ తర్వాత కొన్ని నిమిషాలు ఆలస్యంగా వచ్చిన పలువురు విద్యార్థులను లోనికి అనుమతించకపోవడంతో ఏడుస్తూ వెనక్కి తిరిగారు.
మహబూబాబాద్ జిల్లాలో ఆలస్యంగా ఐదుగురు విద్యార్థులు పరీక్షా కేంద్రానికి వచ్చారు. అధికారులు వారిని లోనికి అనుమతించేందుకు ససేమిరా అన్నారు. డీఎస్పీ తిరుపతిరావు ఆధ్వర్యంలో పరీక్షా కేంద్రం వద్ద గట్టి పోలీసు బందోబస్తు నిర్వహించారు. పరీక్షా కేంద్రం పరిసరాల్లో 144వ సెక్షన్ విధించారు. ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో నీట్ ప్రవేశ పరీక్ష మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రశాంతంగా ముగిసింది.