calender_icon.png 1 August, 2025 | 6:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూభారతితో రైతుల భూములకు భద్రత

19-04-2025 07:46:31 PM

జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్..

మహబూబాబాద్ (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా రూపొందించిన భూభారతి చట్టంతో రైతుల భూములకు భద్రత ఉంటుందని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్(District Collector Adwait Kumar Singh) అన్నారు. జిల్లాలోని చిన్న గూడూరు మండలం ఉగ్గంపల్లి గ్రామ రైతు వేదికలో భూభారతి చట్టంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... భూభారతి చట్టంలో కొత్తగా మార్పులు చేర్పులు చేయడంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా తప్పొప్పులు జరిగితే సులువుగా సవరించుకోవచ్చన్నారు.

క్షేత్రస్థాయిలో భూ సమస్యలను గుర్తించి సంబంధిత తహసిల్దార్, ఆర్డీవో, అడిషనల్ కలెక్టర్, కలెక్టర్, కమిషనర్ స్థాయిలో సునాయాసంగా సమస్యను పరిష్కరించడం జరుగుతుందన్నారు. భూభారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పించేందుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించారు. రైతులు చట్టంలో కొన్ని విషయాలపై సందేహాలు వ్యక్తం చేయగా వాటికి కలెక్టర్ సమాధానం, పరిష్కార మార్గాలు వివరించారు. 

ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు ఉండొద్దు..

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ధాన్యం వర్షానికి తడవకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని, అవసరమైన టార్పాలిన్లను అందుబాటులో ఉంచుకోవాలని నిర్వాహకులను ఆదేశించారు. చిన్న గూడూరు లో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ కే.వీరబ్రహ్మచారి, ఆర్డీవో గణేష్, డి.ఎస్.ఓ ప్రేమ్ కుమార్, పౌరసరఫరాల అధికారి కృష్ణవేణి, తహసిల్దార్ మహబూబ్ అలీ పాల్గొన్నారు.