17-08-2024 12:00:00 AM
నేడు ఇంజినీరింగ్, డిగ్రీ, ఫార్మా, సైన్స్ విద్య అభ్యసించిన వారంతా ఐటీ రంగం వైపు మొగ్గు చూపుతున్నారు. అందుకు కారణం, వారికి ఇతర రంగాలకన్నా ఎక్కువ జీతాలు చెల్లించడం. కాలేజీ విద్య పూర్తి కాకముందే చివరి సంవత్సరంలో కంపెనీలు సెలెక్ట్ చేసుకొని ఆఫర్ లెటర్ ఇవ్వడం జరుగుతున్నది. దీనివల్ల యువత ఎగిరి గంతేసి ఆయా కంపెనీల్లో చేరిపోతున్నారు. కానీ, ప్రపంచ మార్కెట్‌లో సంభవించే ఒడుదొడుకుల మధ్య నెలలు గడిచినా నియామకాలు చేయడం లేదు. యువతను దోపిడీ చేయడంలో ఐటీ కంపెనీలకు భయంకరమైన రికార్డు ఉంది.
తాజా రిక్రూట్లు వారి కాంట్రాక్ట్‌ను బట్టి రెండు, మూడేళ్ల లాక్-ఇన్ పీరియడ్ కోసం కంపెనీ మానవ వనరుల విభాగంలో వారి అసలు అర్హత సర్టిఫికెట్లన్నింటినీ జమ చేయవలసి వస్తుంది. ఆమె/అతను ఉద్యోగాన్ని నిలిపి వేయాలనుకుంటే కంపెనీ కార్మికుడికి భారీ జరిమానాలు విధిస్తుంది. వీరంతా వర్చువల్ బాండెడ్ లేబర్‌లాగా పని చేయవలసి వస్తుంది.
ఈ రకంగా ఐటీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత ఉండటం లేదు. వారి పని పరిస్థితులకు వ్యతిరేకంగా నిరసన తెలిపే హక్కు కూడా వారికి లేదు. ఎలాంటి ఆరోగ్య, సామాజిక భద్రత లేదు. ఐటీ కంపెనీలు కార్మికులను ఇష్టానుసారంగా తొలగించడంలో పేరు గాంచాయి. ముఖ్యంగా కోవిడ్- మహమ్మారి సమయం నుండి పెద్ద, చిన్న ఐటీ సంస్థలు మూకుమ్మడిగా ఉద్యోగులను తొలగించాయి. ఐటీ ఉద్యోగులు ఎన్నో కలలు కని సొంత ఇంటికోసం బ్యాంకులు ఇచ్చిన హౌసింగ్ లోన్ నెలవారీ వాయిదాలు కట్టలేక, కారు లోన్ తీర్చలేక, కుటుంబ భారం మోయలేక బాధ పడుతున్నారు.
పారిశ్రామిక వివాదాల చట్టం 1947 ప్రకారం, వంద లేదా అంతకంటే ఎక్కువమంది కార్మికులను నియమించే ఏ సంస్థ అయినా కార్మికులను తొలగించే ముందు ప్రభుత్వం నుంచి అనుమతిని పొందవలసి ఉంటుంది. ఐటీ కంపెనీలకు ఈ స్టాండింగ్ ఆర్డర్ల నుండి మినహాయింపు ఇచ్చారు. కాబట్టి, వారు ఉద్యోగులను తొలగించవచ్చు. దేశంలోని ఐటీ పరిశ్రమకు చెందిన ప్రముఖుడు ఇటీవల యువత వారానికి 70 గంటలు పని చేయాలని పిలుపునిచ్చారు.
ఐటీ పరిశ్రమలో 12-- గంటల పని దినాలు ఆనవాయితీగా ఉంది. ఇది మరింతగా పెంచవచ్చు. ఉద్యోగులు ఇంటికి వచ్చిన తరువాత కూడ కుటుంబసభ్యులతో గడపకుండా ఎడతెగని ఫోన్ కాల్స్, వర్క్ ఇ-మెయిల్ చేయడంతో మానసిక ఒత్తిళ్లకు గురవుతున్నారు. దీంతోపాటు నిద్ర లేమి భరించలేక డ్రగ్స్‌కు అలవాటు పడుతున్నారు. కొన్ని స్వచ్చంద సంస్థలు కౌన్సెలింగ్ ఇచ్చినా వారు మానసిక స్థితి నుంచి పూర్తిగా కోలుకోలేక పోతున్నారు.
ఆళవందార్ వేణుమాధవ్