17-08-2024 12:00:00 AM
ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న జమ్మూ, కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. సెప్టెంబర్ 30 నాటికి రాష్ట్రంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరగాలన్న సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాల మేరకు కేంద్ర ఎన్నికల సంఘం జమ్మూ, కశ్మీర్ అసెంబ్లీ ఎన్నిలకకు షెడ్యూల్ ప్రకటించింది. గత నెల రాష్ట్రంలో పర్యటించిన ప్రధాని మోదీ సైతం రాష్ట్రంలో త్వరలోనే ఎన్నికలు జరుగుతాయని, రాష్ట్ర ప్రతిపత్తిని పునరుద్ధరించడం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం మీడియా సమావేశంలో జమ్మూ, కశ్మీర్‌తోపాటు హర్యానా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌నూ ప్రకటించింది. జమ్మూ, కశ్మీర్‌లోని మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు మూడు దశల్లో ఎన్నికలు జరుగుతాయి.
సెప్టెంబర్ 18న తొలిదశ, 25న రెండో దశ, అక్టోబర్ 1న మూడో దశ ఎన్నికలు జరుగుతాయి. అక్టోబర్ 4న ఫలితాలు వెలువడుతాయి. అటు హర్యానాలోని మొత్తం 90 అసెంబ్లీ నియోజక వర్గాలకు అక్టోబర్ 1న ఒకే దశలో ఎన్నికలు జరుగుతాయి. 4న ఫలితాలు వెలువడుతాయి. పలు దశల్లో సమీక్షల అనంతరం కశ్మీర్‌లో ఎన్నికలకు ఏర్పాట్లు చేశామని ఈసీ రాజీవ్‌కుమార్ తెలిపారు. అన్ని పార్టీల అభిప్రాయాలనూ తెలుసుకున్నామని చెప్పారు. జమ్మూ, కశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలు కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి జరుగుతున్న ఎన్నికలు కావడంతో వీటికి ఎంతో ప్రాధాన్యత ఉంది. కశ్మీర్‌లో చివరిసారిగా 2014లో అసెంబ్లీ ఎన్నికు జరిగాయి. అప్పుడు లడఖ్‌తో కలిపి 87 స్థానాలకు ఎన్నికలు జరిగాయి.
2019లో జమ్మూ, కశ్మీర్ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాం తంగా అవతరించింది. ఆర్టికల్ 370 రద్దుతో రాష్ట్రం మూడు ముక్కలు కాగా, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతమైంది. జమ్మూ, కశ్మీర్ కలిసి రాష్ట్రంగా ఏర్పాటైంది. 2022లో డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయ్యాక అసెంబ్లీ స్థానాల సంఖ్య 87 నుంచి 90కి పెరిగింది. కాగా, గతంలో ప్రభుత్వ పదవీ కాలం ఆరేళ్లు ఉండగా ఇప్పుడది అయిదేళ్లు మాత్రమే ఉంటుంది. మొత్తం 90 స్థానాల్లో కశ్మీర్ డివిజన్‌లో 43 స్థానాలు ఉండగా, జమ్మూలో 47 ఉన్నాయి.
జమ్మూలో హిందూ ఓటర్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఆధిపత్యం సాధించడం ద్వారా అధికారంలోకి రావాలని కమలనాథులు ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల సందర్భంగా లడఖ్‌తోపాటు జమ్మూ, కశ్మీర్‌లోని నాలుగు లోక్‌సభ స్థానాలకూ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓటర్లు పాల్గొనడాన్నిబట్టి రాష్ట్ర ప్రజలు మార్పును కోరుకుంటున్నారని స్పష్టమవుతున్నదని ఈ సందర్భంగా ఈసీ చెప్పారు. అమర్‌నాథ్ యాత్ర ముగిసిన మరుసటి రోజు (ఆగస్ట్ 20న) ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తామని, మొత్తం 87 లక్షల మంది ఓటింగ్‌లో పాల్గొననున్నారని చెప్పారు.
వాస్తవానికి జమ్మూ, కశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికలతోపాటే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌నూ ఈసీ ప్రకటిస్తుందని భావించారు. నిజానికి గత మూడు దఫాల్లోను హర్యానాతోపాటే ఈ రాష్ట్ర అసెంబ్లీకీ ఎన్నికలు జరిగాయి. ఈసారి జమ్మూ, కశ్మీర్ ఎన్నికలపై ఎక్కువ దృష్టిపెట్టాల్సి ఉండడంతో మహారాష్ట్ర ఎన్నికలను తర్వాత నిర్వహించాలని నిర్ణ యించినట్లు రాజీవ్ కుమార్ చెప్పారు. అదీగాక రాష్ట్రంలో ఆ సమయం లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడం, వినాయక చవితిలాంటి పండగలు వస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు.
బహుశా ఢిల్లీ, జార్ఖండ్ అసెంబ్లీలతోపాటు మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించవచ్చని భావిస్తున్నారు. మరో వైపు రాయబరేలి నుంచి కూడా గెలిచిన రాహుల్‌గాంధీ కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే, ఇటీవల అక్కడ ప్రకృతి విలయం కారణంగా వందలాదిమంది ప్రాణాలు కోల్పోయిన దృష్ట్యా ప్రస్తుతం అక్కడ ఉపఎన్నిక వాయిదా వేసినట్లు రాజీవ్ కుమార్ తెలిపారు.