25-07-2025 02:02:38 AM
జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవర్
నూతనకల్, జూలై 24: రైతులకు కావలసినన్ని విత్తనాలు, ఎరువులు అందుబాటులోనే ఉన్నాయని కావున రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ తెలిపారు.గురువారం మండల కేంద్రంలోని మహిళా రైతు ఉత్పత్తిదారుల ఎరువుల దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎరువులు విత్తనాల నిలువలను, అమ్మకాలను, ఈపాస్ యంత్రములో నమోదు వివరాలను పరిశీలించారు.
మండలంలోని వివిధ గ్రామాల ఎరువుల విక్రయ కేంద్రాలకు మ్యాపింగ్ చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఎరువుల విక్రయ కేంద్రాల నిర్వహకులు ప్రతిరోజు సమయపాలన పాటించి వచ్చిన ఎరువులను క్రమ పద్ధతిలో రైతులకు అందించాలని సూచించారు. అనంతరం మండల పరిధిలోని గుండ్ల సింగారంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను తనిఖీ చేశారు.
పాఠశాలలో ఉన్న సమస్యలను విద్యార్థులను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.విద్యా బోధన భోజన సదుపాయం ఇతర మౌలిక వసతులు ఎలా ఉన్నాయి ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అనే విషయాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
పాఠశాల ఆవరణ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేయించాలని మెనూ ప్రకారం భోజనం అందించాలని ఆదేశించారు. ఆయన వెంట తాసిల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీవో సునీత, మండల వ్యవసాయ శాఖ అధికారి మురళి తదితరులున్నారు.