04-08-2025 08:34:40 PM
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్..
నస్పూర్ (విజయక్రాంతి): ప్రజా సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం వైద్య రంగాన్ని బలోపేతం చేస్తూ అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, సామాజిక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యులు, సిబ్బందిని నియమించి అవసరమైన మందులను అందుబాటులో ఉంచి అందిస్తున్న మెరుగైన వైద్య సేవలను ప్రజలు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(District Collector Kumar Deepak) అన్నారు. సోమవారం నస్పూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి వార్డులు, మందుల నిల్వలు, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, వర్షాకాలం అయినందున అంటువ్యాధుల వ్యాప్తిని నివారించేందుకు పాటించవలసిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని, వార్డులు, ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.
వైద్యులు, సిబ్బంది విధులలో సమయపాలన పాటించాలని, ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజలకు వైద్య సేవలు అందించాలన్నారు. నస్పూర్ మండల కేంద్రంలోని కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయం, మంచిర్యాల పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళ డిగ్రీ కళాశాలను సందర్శించి వంటశాల, మూత్రశాలలు, తరగతి గదులు, హాజరు పట్టికలు, పరిసరాలను కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు. ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ అన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సకల సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్యాబోధన అందిస్తుందని తెలిపారు.
విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో మెనూ ప్రకారం సకాలంలో పోషక విలువలు గల ఆహారం, శుద్ధమైన తాగునీటిని అందించాలని, విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. ఆహారం తయారీ సమయంలో తాజా కూరగాయలు, నాణ్యమైన నిత్యావసర సరుకులు వినియోగించుకోవాలని తెలిపారు. వర్షాకాలం అయినందున వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల శుభ్రత ఎంతో అవసరమని, విద్యార్థులు ఆహారం, త్రాగునీరు తీసుకునే ముందు తప్పనిసరిగా చేతులు శుభ్రపరుచుకోవాలని తెలిపారు. 10వ తరగతి విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించి వివిధ సబ్జెక్టులలో ప్రశ్నలు అడిగి వారి పఠనా సామర్థ్యాలను తెలుసుకున్నారు. మహిళా డిగ్రీ కళాశాలలో డిగ్రీ ఫ్రథమ సంవత్సరం విద్యార్థినులకు పాఠ్యంశాలు బోధించి ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని సాధించే దిశగా ఏకాగ్రతతో కృషి చేయాలన్నారు.