16 March, 2026 | 4:02 AM

ప్రభుత్వ సాయం కోరతా: ఎంపీ ఈటల

16-03-2026 01:08 AM

ఘట్ కేసర్, మార్చి 15 (విజయక్రాంతి): స్పెనల్ మస్క్యూలర్ ఆట్రోఫీ (ఎస్‌ఎంఏ) టైప్-2 వ్యాధితో బాధపడుతున్న ఘట్ కేసర్ పట్టణం కె.ఎల్.ఆర్ నగర్ కు చెందిన ఆర్యన్ (2) వైద్య చికిత్స కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం కోరతానని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం ఆర్యన్ తల్లిదండ్రులు కిరణ్-నవీన ఘట్ కేసర్ మాజీ ఎంపీపీ, బిజెపి మేడ్చల్ నియోజకవర్గం ఇన్చార్జి ఏనుగు సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీ ఈటల రాజేందర్ ను ఆయన నివాసంలో కలిశారు.

ఆర్యన్ బాధపడుతున్న ఎస్‌ఎంఏ టైప్-2 వ్యాధి గురించి వివరించారు. ఇలాంటి ప్రాణాంతకమైన వ్యాధి చికిత్స రూ. కోట్లతో కూడుకోవడం బాధాకరమని, ఆర్థిక సాయం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానని, తన వంతుగా కూడా ఆర్థిక సాయం అందజేస్తానని అన్నారు. రాష్ట్ర ప్రజలు ఆర్యన్ కోసం విరాళాలు అందించడానికి ముందుకు రావాలని ఎంపీ ఈటెల రాజేందర్ కోరారు.