calender_icon.png 20 October, 2025 | 8:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వయంకృతాపరాధం!

20-10-2025 01:06:56 AM

  1. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చరిత్రలోనే అధ్యక్ష పదవి నుంచి  స్వతహాగా తప్పుకున్న వ్యక్తిగా  రాజశేఖర్ 

ఒంటెద్దు పోకడే అధ్యక్ష పదవికి ఎసరు

గత కొన్ని రోజులుగా అంతర్గత కుమ్ములాటలు

అధ్యక్ష పదవి చేపట్టిన నాటి నుండి వివాదమే

వికారాబాద్, అక్టోబర్ -19: జిల్లా బిజెపి రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా చోటు చేసుకున్న అంతర్గత కుమ్ములాటలు ఎట్టకేలకు జిల్లా బిజెపి అధ్యక్షుడి రాజీనామాకు దారితీసింది. ఆయన రాజీనామా స్వయంకృతాపరాధమే నని పలువురు బిజెపి సీనియర్ నాయకులు భావిస్తున్నారు.  రాజకీయంగా అనుభవం లేకపోవడం, ఒంటెద్దు పోకడ వంటి పరిణామాలు రాజకీయ పార్టీలో ఎంత ప్రమాదమో డాక్టర్ రాజశేఖరే ఉదాహరణ.

ఆరు నెలల  కాలంలోనే జిల్లా అధ్యక్ష కుర్చీని ఆయన ముళ్ళకుర్తిగా మార్చుకున్నారు. అంతర్గత కుమ్ములాటలను సమర్థవంతంగా ఎదుర్కోలేక, ఎంపీ స్థాయి నాయకులతో సఖ్యతగా మెలగలేక   జిల్లా అధ్యక్ష పదవికే ఎసరు తెచ్చుకున్నారు.   సహజంగానే వికారాబాద్ జిల్లా బిజెపిలో మూడు నుండి నాలుగు గ్రూపులు ఏర్పడి ఎప్పుడూ అంతర్గత పోట్లాటలతోనే కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.

ఏ గ్రూపు నాయకుడికి జిల్లా అధ్యక్ష పదవి దక్కితే అతని తాలూకు చెందిన వారికి మిగతా పార్టీ పదవులు దక్కడం, మిగతా గ్రూపుల వారు చేసేదేమీ లేక గమ్మున ఉండి పోవడం పరిపాటిగా మారింది. అయితే జిల్లా బిజెపిలో ఎన్ని గ్రూపులు ఉన్న పార్టీ అధిష్టానం ఇచ్చిన కార్యక్రమాలను మాత్రం ఎవరికి వారు తప్పకుండా నిర్వహిస్తుంటారు. అంతర్గత విభేదాలు ఎన్ని ఉన్నా బహిరంగ విమర్శలు చేసుకున్న దాఖ లాలు లేవు. కానీ డాక్టర్ రాజశేఖర్ జిల్లా అధ్యక్షుడిగా ఎంపికైన నాటి నుండి అంతర్గత పోరు కాస్త బహిర్గతమవుతూ వచ్చింది.

స్థానికేతరుడికి దక్కడంపై గుర్రు

స్థానికేతరుడైన డాక్టర్ రాజశేఖరకు జిల్లా అధ్యక్ష పదవి దక్కడంతో స్థానిక బిజెపి నాయకులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.  దశాబ్దాలుగా పార్టీకి సేవ  చేస్తున్న వారిని కాదని ఏడాది క్రితం పార్టీలోకి వచ్చిన రాజశేఖర్ కు అధ్యక్ష పదవి ఇవ్వడం పై అధిష్టానం వద్ద తమ నిరసనను వ్యక్తం చేశారు.

అయినా ఫలితం లేకపోయింది. రాజశేఖర్ కు అధ్యక్ష పదవి దక్కడం వెనుక చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి హస్తం ఉందని మొదట్లో స్థానిక నాయకులు భావించారు. రాజశేఖర్ రెడ్డి కాకుండా జిల్లా అధ్యక్ష పదవి ఆశించిన వారంతా ఎంపీకి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం చేయలేక గమ్మున ఉండిపోయారు. కానీ అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డికి ఎక్కడ కూడా సహకారం అందించడానికి ఇష్టపడలేదు.

పదవికే ఎసరు తెచ్చిన వీడియో మార్పింగ్

గత నాలుగు నెలల క్రితం పరిగిలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతున్న ఎంపీ కొండను కొందరు బిజెపి కార్యకర్తలు డాక్టర్ రాజశేఖర్ సమక్షంలో  మన్నెగూడ సమీపంలో ఆపి వికారాబాద్ లోని కార్యక్రమానికి రావాలని కోరారు. అందుకు ఎంపీ నిరాకరించి చెప్పిన మాటలను వీడియో తీయించిన రాజశేఖర్ ఎంపీ మాటలను మార్పింగ్ చేసి బిజెపి అధిష్టానం లోని కొందరు పెద్దలకు వీడియోలు చూపించినట్లు ప్రచారంలో ఉంది.

ఈ వీడియో మార్పిడి ఆయన మెడకు చుట్టుకుందని ఆయన వర్గీయుల అభిప్రాయం. అప్పటి నుండి జిల్లా అధ్యక్షుడి తీరుపై గురువుగా ఉన్న ఎంపీ వికారాబాద్ జిల్లా పర్యటనకు ఎప్పుడు వచ్చినా ఆయనకు ప్రాధాన్యత ఇవ్వలేదు. పార్టీ సమీక్ష నిర్వహించే సమయంలో కూడా రాజశేఖర్ ను లోపలికి అనుమతించలేదు. మరో సందర్భంలో ఎంపీ ఇంతకీ నీకు అధ్యక్ష పదవి ఎవరు ఇప్పించారో చెప్పయ్య బాబు అని రాజశేఖర్ ను ప్రశ్నించడంతో నాయకులు ఆశ్చర్యానికి గురయ్యారు. 

డాక్టర్ రాజశేఖరకు జిల్లా అధ్యక్ష పదవి దక్కడం వెనక తన పాత్రలేదని, తాను చూపించిన నాయకులకు కనీసం పార్టీ పదవులు ఇవ్వడం లేదని ఎంపీ అందరు ముందు అసహనం వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షుడి తీరుపై ఏకంగా ఎంపీ నే అసహనంతో ఉండడంతో మిగతా నాయకుల వ్యతిరేకత మరింత అధికమైంది. ఎట్టకేలకు రాజశేఖర్ రెడ్డి రాజీనామాకు దారితీసింది.

గ్రూపు రాజకీయాలకు ఆద్యం 

ఏమాత్రం రాజకీయ అనుభవం లేని రాజశేఖర్ అధ్యక్ష పదవి చేపట్టిన కొన్ని రోజుల్లోనే సీనియర్లను దూరం పెడుతూ, పార్టీ కార్యక్రమాల గురించి సమాచారం ఇవ్వకుండా తన వర్గంతోనే  నిర్వహించే ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. జిల్లా కమిటీలో  ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి చూపించిన వారికి కూడా అవకాశం ఇవ్వలేదనే విమర్శలు ఉన్నాయి.

అప్పటివరకు జిల్లా అధ్యక్షుడు స్థానిక నాయకులుగా ఉన్న వివాదం  కాస్త జిల్లా అధ్యక్షుడికి,  ఎంపీకి మధ్య  మారింది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కొత్తవారిని పార్టీలోకి తీసుకొచ్చి పార్టీ పదవులు ఇచ్చి సొంత గ్రూపును తయారు చేసుకునే ప్రయత్నం చేశారని విమర్శలు ఉన్నాయి. తనకు సామాజిక రక్షణగా కొన్ని వర్గాల వారికి, మహిళలకు పార్టీ పదవులు ఇచ్చి ఇతర నాయకులను భయపె ట్టించే ప్రయత్నం చేసినట్లు కూడా విమర్శలు ఉన్నాయి.

దీంతో సీనియర్లు మరింత అగ్రహానికి గురై అధిష్టానం కు రోజు ఫిర్యాదులు చేయడం ప్రారంభించారు. రెండు నెలల క్రితం రాష్ర్ట బిజెపి అధ్యక్షుడు రామ్ చందర్రావు వికారాబాద్ కు వచ్చారు. ఈ సంద ర్భంగా నిర్వహించిన సమావేశంలో రాజశేఖర్‌కు వేదికపై ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వక పోవడం చూస్తుంటే స్థానిక నాయకులు ఎంత గురుగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.

జిల్లా కన్వీనర్‌గా కరణం

రాజశేఖర్ రెడ్డి  తన జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేయగా  అధిష్టానం ఆమోదించింది. ఇదే సమయంలో సీనియర్ నాయకుడు కరణం ప్రహ్లాద్ రావు ను జిల్లా కన్వీనర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉండగా బిజెపి జిల్లా అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందనే చర్చ జోరుగా సాగుతుంది.

ప్రధానంగా గతంలో జిల్లా అధ్యక్షుడిగా పని చేసిన ఈ సదానంద రెడ్డి మరోసారి పదవిని ఆశిస్తుండగా, తాండూర్ కు చెందిన సీనియర్ నాయకుడు రమేష్ కుమార్, పరిగికి చెందిన పరమేశ్వర్ రెడ్డి అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి ఆశీస్సులు ఎవరికి ఉంటే వారికి జిల్లా అధ్యక్ష పదవి దక్కే అవకాశం ఉంది.