1 July, 2026 | 8:53 AM

ఆ తహసీల్దార్లను సొంత జిల్లాలకు పంపండి

29-06-2024 12:02 AM

రెవెన్యూ మంత్రికి ‘ట్రెసా’ నాయకుల విజ్ఞప్తి

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 28 (విజయక్రాంతి): ఎన్నికల వేళ బదిలీ అయిన తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లను సొంత జిల్లాలకు పంపాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) ప్రతినిధి బృందం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కోరింది. ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆ సంఘం ప్రతినిధులు శుక్రవారం నగరంలోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లోని మంత్రి నివాసంలో ఆయన్ను కలిశారు. పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

ఈ నెలలో పదవీ విరమణ పొందే ఏడుగురు తహసీల్దార్లను వారి సొంత జిల్లాలకు పంపాలని కోరారు. బాలానగర్ ఆర్‌ఐ వెంకట్‌రెడ్డి సస్పెన్షన్‌ను నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. తమ వినతికి మంత్రి సానుకూలంగా స్పందించారని సంబంధిత అధికారులకు ఫోన్‌చేసి మాట్లాడారని ట్రెసా నాయకులు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో ట్రెసా ప్రధానకార్యదర్శి కె.గౌతమ్‌కుమార్, ఉపాధ్యక్షులు బాణాల రాంరెడ్డి, కె.నిరంజన్‌రావు, మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు చెన్న కిష్టన్న, కార్యదర్శి రాజ్‌గోపాల్, జగిత్యాల్ జిల్లా అధ్యక్షుడు ఎండీ వకీల్ తదితరులు పాల్గొన్నారు.