18-12-2025 06:45:49 PM
* గుండెపోటుతో ఆకస్మిక మరణం
* మొండికుంటలో విషాదఛాయలు
* పార్థివ దేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు
అశ్వాపురం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ జిల్లేపల్లి గోవర్ధన చారి(50) గురువారం గుండెపోటుతో ఆకస్మికంగా మృతిచెందారు. నిబద్ధత గల జర్నలిస్టుగా పేరున్న గోవర్ధన చారి మృతి పట్ల పాత్రికేయ లోకం, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గురువారం తెల్లవారుజామున గోవర్ధన చారికి ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడంతో, కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే, పరిస్థితి విషమించడంతో ఆయన మార్గమధ్యలోనే తుదిశ్వాస విడిచారు.
ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు నివాళి:
విషయం తెలుసుకున్న స్థానిక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు హుటాహుటిన మొండికుంటలోని గోవర్ధన చారి స్వగృహానికి చేరుకున్నారు. ఆయన పార్థివ దేహంపై పూలమాల వేసి కన్నీటి నివాళులర్పించారు. గోవర్ధన చారి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెబుతూ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
కాంగ్రెస్ శ్రేణుల సంతాపం:
అశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గోవర్ధన చారి భౌతిక కాయానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఓరుగంటి బిక్షమయ్య, సీనియర్ నాయకులు గాదె కేశవరెడ్డి, మల్లెలమడుగు సర్పంచ్ మచ్చ నరసింహారావు, ఆవుల రవి, తూము వీరరాఘవులు, గొల్లపల్లి నరేష్ కుమార్, బారాజు సంపత్, గొడ్ల నాగేశ్వరరావు, తోట అశోక్, మిట్ట ప్రశాంత్, ఏర్పుల నారాయణ, ఉక్కు మహేష్ తదితరులు పాల్గొని నివాళులర్పించారు.