18-12-2025 07:42:25 PM
తాండూరు (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల కేంద్రంలో శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ వైభవంగా ఘనంగా జరిగింది. 29 సార్లు శ్రీ అయ్యప్ప మాల ధరించిన ఆర్ఎంపి వైద్యుడు శంకర్ గురుస్వామి నివాసంలో జరిగిన మహా పడిపూజ కార్యక్రమాలకి భక్తులు భారీగా తరలివచ్చారు. గురుస్వాముల మంత్రోచ్ఛారణలు మధ్య స్వామివారికి వివిధ రకాల అభిషేకాలు నిర్వహించారు. వికారాబాద్ పట్టణానికి చెందిన రవి స్వామి బృందం ఆలపించిన భజన సంకీర్తనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్వామి శరణు ఘోషతో పెద్దముల్ గురువారం మారుమ్రోగింది. భక్తిశ్రద్ధలతో 18 మెట్లపై ఉన్న దీపాలను శంకర్ గురుస్వామి వెలిగించారు. అనంతరం భక్తులకు భారీగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.