18-12-2025 06:51:00 PM
డా. బెల్లి యాదయ్య..
నకిరేకల్ (విజయక్రాంతి): జీవనోపాధి కొరవడటంతో నిరుపేదలు పట్టణాలు, నగరాలకు వలస వెళ్లి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నకిరేకల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రధానాచార్యులు డా. బెల్లి యాదయ్య అన్నారు. గురువారం నకిరేకల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అర్థశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, మెరుగైన ఉపాధి, జీతభత్యాల కోసం విదేశాలకు వెళ్లిన పట్టభద్రులు కూడా అవమానాలు, హింసను ఎదుర్కొంటున్నారని తెలిపారు. వలసదారుల జీవితం ఒడవని దుఃఖంగా మారిందని పేర్కొన్నారు. శ్రామిక వలసలు, మేధో వలసలు ఉపరితలంగా ఆర్థిక వ్యవస్థకు తోడ్పడినట్లుగా కనిపించినప్పటికీ, వాస్తవానికి పేదలు, విద్యావంతులు వలసదారులుగా మారి శ్రమదోపిడికి గురవుతున్నారని చెప్పారు.
వలసదారుల సమస్యలకు సత్వర పరిష్కారం చూపే విధంగా ప్రభుత్వాలు స్పష్టమైన విధానాలు రూపొందించాలని కోరారు. కార్యక్రమంలో వలసదారుల సమస్యలపై విద్యార్థులతో చర్చించారు. కార్యక్రమానికి అర్థశాస్త్ర అధ్యాపకురాలు కె. హరిత అనుసంధానకర్తగా వ్యవహరించారు. అనంతరం అంతర్జాతీయ వలసదారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులు రూపొందించిన ఉత్తమ ఐదు స్టడీ ప్రాజెక్టులకు ప్రధానాచార్యులు కీ.శే. బెల్లి సాయిలు స్మారక నగదు పారితోషికాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ నాగు, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డా. శ్రీనివాసాచారి, అధ్యాపకులు శ్రీనివాస్, మధుసూదన్ రెడ్డి, శంకర్, రవీందర్, శివశంకర్, ఉపేందర్, సుభాషిణి, కార్యాలయ సిబ్బంది వెంకన్న, సుదర్శన్, కార్తీక్, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.