calender_icon.png 14 August, 2025 | 4:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చందానగర్ పీఎస్ పరిధిలో వరుస చోరీలు

14-08-2025 02:03:20 AM

పోలీసుల వైఫల్యంపై ప్రజల ఆగ్రహం

చందానగర్, ఆగస్టు 13: చందానగర్ పోలీసు స్టేషన్ పరిధి దొంగల అడ్డాగా మారిపోయింది. ఒకటి కాదు రెండు కాదు వరుస చోరీలు జరగడంతో ప్రజల్లో ఆందోళన, ఆగ్రహం వెల్లువెత్తుతున్నాయి. మొన్నటికి మొన్న రెండు దేవాలయాల్లో హుండీలు ఎత్తుకెళ్లిన దుండగులు, మంగళవారం ఉద యం ఖజానా జ్యువెలరీలో పట్టపగలు భారీ దోపిడీకి తెగబడ్డారు.

ఈ ఘటన మరవకముందే అదే రాత్రి గోపన్పల్లి గ్రామంలోని సంత్ సేవాలాల్ దేవాలయం హుండీని గుర్తు తెలియని దుండగులు లూటీ చేశారు. సీసీటీవీ కెమెరాల్లో దుండగుల సాహసం రికార్డవ్వగా, ఉదయం గ్రామస్థులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు పోలీసులు తెలిపారు.

గుడి కమిటీ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం సంత్ సేవాలాల్ దేవాలయం హుండీతో పాటు పక్కనే ఉన్న తుల్జా భవాని దేవాలయం హుండీని దొంగిలించినట్లు చెప్పా రు. ఒక్కో హుండీలో 40 నుంచి 50 వేల వరకు నగదు ఉండి ఉండొచ్చని అంచనా. అయితే కేవలం చందానగర్ పరిధిలో ఇంత తక్కువ సమయంలో ఇన్ని చోరీలు  జరగడం పట్ల ప్రజలు పోలీసుల ఘోర వైఫల్య మేనని మండిపడుతున్నారు. దొంగలు దర్జాగా రాజ్యమేలుతుంటే పోలీసులు కేవలం ఎఫ్‌ఐఆర్లకే పరిమితం కావడంపట్ల ప్రజల్లో తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.

చందానగర్ ఖజానా జ్యువెలరీ దోపిడీ కేసులో కీలక పురోగతి

చందానగర్లోని ఖజానా జ్యువెలర్స్‌లో నిన్న జరిగిన దోపిడీ కేసులో పోలీసులు నిమగ్నమయ్యారు. మాస్క్‌లు, హెల్మెట్లు ధరించి తుపాకులతో బెదిరించి చోరీకి పాల్పడిన దొంగల కోసం సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి ఆధ్వర్యంలో ప్రత్యేక గాలింపు సాగింది. పటాన్‌చెరు సర్వీస్ రోడ్డుపై వెళ్తున్న ముగ్గురిని, సంగారెడ్డి సమీపంలో మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

వీరు రెండు బైక్లపై వేర్వే రు మార్గాల్లో ప్రయాణిస్తుండగా పట్టుబడ్డారు. ముఖాలకు మాస్క్‌లు, తలపై క్యాప్‌లు, చేతులకు గ్లౌజులు వేసుకున్న వీరే దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తు న్నా రు. దొంగతనానికి ఉపయోగించిన బైక్ లనే ఈ ఘటనలో వాడినట్లు ప్రాథమిక సమాచారం. అయితే ఖజానా జ్యువెలర్స్‌లో దోపిడీ చేసినవారేనా అనే విషయంపై పోలీసులు ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు.