01-11-2025 12:49:46 PM
శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం(Andhra Pradesh) శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ విజయ వెంకటేశ్వరస్వామి ఆలయంలో(Kasibugga Venkateswara Temple) శనివారం తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాట(stampede) ఘటనలో తొమ్మిది మృతి చెందినట్లు కాశీబుగ్గ సబ్-డివిజన్ ఇన్‌చార్జ్ డీఎస్పీ లక్ష్మణరావు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని తెలుస్తోంది. తొక్కిసలాటలో కొందరు భక్తులు స్పృహతప్పి పడిపోయారు. స్పృహతప్పి పడిపోయిన వారిని కాశీబుగ్గ పీహెచ్ సీకి తరలించారు. కార్తీకమాసం 'ఏకాదశి' సందర్భంగా ఆలయానికి భారీగా భక్తులు పోటెత్తారు. భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో అధికారులు నియంత్రించలేకపోయారు, ఫలితంగా భక్తుల మధ్య తోపులాట, తొక్కిసలాట జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొక్కిసలాటపై విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. ఘటనాస్థలిలో ప్రస్తుతం సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. తొక్కిసలాట మృతుల్లో నలుగురిని చిన్నమి, విజయ, నీలిమ, రాజేశ్వరిగా గుర్తించగా, మిగిలిన వారిని గుర్తించడానికి అధికారులు కృషి చేస్తున్నారు.