01-11-2025 01:30:44 PM
శ్రీకాకుళం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం జరిగిన తొక్కిసలాటలో(Kashi Bugga stampede incident) తొమ్మిది మంది మరణించినట్లు అధికారులు పేర్కొన్నారు. కార్తీకమాసం 'ఏకాదశి' సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో అధికారులు నియంత్రించలేకపోయారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు(CM Chandrababu ) తొక్కిసలాటపై విచారం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట ఘటన కలచివేసిందని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ దురదృష్టకర ఘటనలో భక్తులు మరణించడం అత్యంత విషాదకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మృతుల కుటుంబాలకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తొక్కిసలాటలో గాయాల పాలైన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాలని సీబీఎన్ స్థానిక అధికారులను, ప్రజాప్రతినిధులను కోరారు. తొక్కిసలాట ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆలయం వద్ద పోలీసులు, రెవెన్యూ, ఫైర్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఇతర ప్రాంతాల నుంచి అధికారులు అంబులెన్స్ లు తెప్పించారు. ఘటనాస్థలిలో ఎమ్మెల్యే గౌతు శిరీష(MLA Gauthu Sirisha) సహాయచర్యలు పర్యవేక్షిస్తున్నారు. ఏకదశి కావడంతో కాశీబుగ్గలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు. ఆలయ సామర్థ్యం 2 వేల నుంచి 3 వేలు మాత్రమేనని అధికారులు పేర్కొన్నారు. మామూలు శనివారాల్లో ఆలయానికి 1000 మంది భక్తులు వస్తారని, ఏకాదశి కావడంతో ఇవాళ ఒక్కరోజే 25 వేల మంది భక్తులు వచ్చినట్లు సమాచారం. అధికారులు, సిబ్బంది ఆలయంలో ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేయలేదని భక్తులు ఆరోపిస్తున్నారు.