calender_icon.png 14 September, 2025 | 3:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వనపర్తి సప్తసముద్రాలు

14-09-2025 12:30:07 AM

ఏడు చెరువులు ఇవే.. 

  1. కొత్తకోట మండలం కానాయపల్లి గ్రామంలో శంకర సముద్రం
  2. సంకిరెడ్డిపల్లి గ్రామంలో కృష్ణా సముద్రం
  3. రాయినిపేట గ్రామంలో రామ సముద్రం
  4. పెద్ద మందడి మండలం వెల్టూరు గ్రామంలో గోపాల సముద్రం
  5. పెబ్బేరు మండలంలో మహభుపాల్ సముద్రం
  6. తాటిపాముల గ్రామంలో వీర సముద్రం. 
  7. శ్రీరంగాపురం మండల కేంద్రంలో రంగ సముద్రం. వీటిలో శంకర సముద్రం, రంగ సముద్రం రిజర్వాయర్లుగా మారాయి.
  8. వనపర్తి జిల్లా ప్రజలకు కల్పతరువులుగా ఏడు చెరువులు
  9. సంస్థానాదీశుల కాలంలో నిర్మాణం

సంస్థనాదీశుల కాలంలోనే వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ.. కరువును పారదోలేలా చిన్న నీటి వనరులను ఏర్పాటు చేశారు. ఆకాశం నుంచి వర్షం రూపంలో వచ్చే ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టేలా 18వ శతాబ్దంలో అప్పటి రాణి శంకరమ్మ హయాంలో పెద్ద ఏడు చెరువులు ( సప్త సముద్రాలు) గొలుసు కట్టు తరహాలో నిర్మించారు. సుమారు రెండు వందల ఏళ్ల క్రితం నిర్మించిన ఏడు చెరువులు వనపర్తి జిల్లా ప్రజలకు ఇప్పటికీ కల్పతరువులుగానే ఉపయోగపడుతున్నాయి.

వ్యవసాయం పండగలా.. 

వనపర్తి సంస్థానాన్ని పరిపాలించిన రాజులు, రాణులు ఒక వైపు అందమైన కట్టడాలు, దేవాలయాలు, కళలను ప్రోత్సహిస్తూ మరో వైపు వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు అప్పటి రాణి శంకరమ్మ హయాంలో బీజం పడినట్లు చరిత్ర చెబుతోంది. వనపర్తి సంస్థానాదీశుల కాలంలోనే సప్త సముద్రాల పేరిట చెరువులు నిర్మించారు.

గుట్టలు, ఎత్తున ప్రాంతాల నుంచి వర్షపు నీరు చెరువుల్లోకి చేరేలా కాల్వలు ఏర్పాటు చేశారు. చెరువులు నిండిన తర్వాత అలుగు పారే నీటిని మరో చెరువులోకి వెళ్లేలా వాగులను నిర్మించారు. చెరువులన్నీ నిండిన తర్వాత చివరగా సప్త సముద్రాల చెరువుల్లోకి వర్షపు నీరు చేరేలా ఏర్పాట్లు చేశారు. దీంతో ఈ ప్రాంతంలో అప్పట్లోనే వ్యవసాయం పండగలా విరాజిల్లినట్లు ప్రచారంలో ఉంది.

రాణిశంకరమ్మ హయాంలో ‘సప్త సముద్రాల’కు బీజం 

వనపర్తి సంస్థానాన్ని ఎక్కువకాలం పాలించిన రాణిగా శంకరమ్మకు చరిత్రలో స్థానం ఉంది. 18వ శతాబ్దంలో రాణి శంకరమ్మ రాజ్యంలో కరువుఛాయలు కనిపించకుండా కురిసిన ప్రతి వర్షం చుక్కను ఒడిసి పట్టి నిల్వ చేసేందుకు ప్రణాళిక రచించారు.

పురాణాల్లో ఉన్న సప్త సముద్రాల మాదిరిగా తన సంస్థానంలో ఏడు పెద్ద చెరువులను నిర్మించి వాటికి సప్త సముద్రాలుగా ఏడు వేర్వేరు పేర్లను పెట్టి భవిష్యత్ తరాలకు తరగని సంపదగా ఇవ్వాలని వీటిని నిర్మించారు. నాటి వనపర్తి సంస్థానంలో రెండు తాలుకాలు కొత్తకోట, పెబ్బేరుల పరిధిలో ఏడు చెరువులను నిర్మించారు.   

అప్పట్లోనే వ్యవసాయ ఆధారిత ప్రాంతంగా గుర్తింపు 

సంస్థానాల కాలం నుంచే వనపర్తి వ్యవసాయ ఆధారిత ప్రాంతంగా గుర్తింపు పొందింది. వనపర్తి సంస్థానాన్ని సుమారు నాలుగు వందల ఏళ్లు పాలించిన రెడ్డి రాజులు వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. ప్రస్తుత పెబ్బేరు మండలంలోని సూగూరు కేంద్రంగా రాజధాని ఏర్పాటు చేసుకుని రాయలసీమకు చెందిన వీరకృష్ణారెడ్డి క్రీ.శ.1510లో పరిపాలన ప్రారంభించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు.

కాలానుగుణంగా శ్రీరంగాపురం, వనపర్తి ప్రాంతాలకు రాజధానిని మార్చి పాలన చేశారు. మొదటి రాజారామేశ్వరావు తదనంతరం 18వ శతాబ్దంలో ఎక్కువ కాలం రాణిశంకరమ్మ వనపర్తి రాజధానిగా సంస్థానాన్ని పరిపాలించారు. సంస్థానానికి వచ్చిన ఆదాయంలో సగభాగం నిజాం ప్రభుత్వానికి కప్పం కడుతూ రాజ్యపాలన చేసేవారు. ప్రస్తుతం జిల్లాకేంద్రంలో ఉన్న రాజమహల్, రాణిమహల్ భవనాలు రాణి శంకరమ్మ హయాంలో నిర్మాణం చేసినవిగా ప్రచారంలో ఉంది.

అంతర్జాతీయ మార్కెట్‌కు ఎగుమతి 

జిల్లాలో పండించే వేరుశనగ పంటల ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు నుంచి చెన్నై, కోల్ కత్తా, ముంబయి ప్రాంతాల నుంచి వ్యాపారులు వచ్చి వేరుశెనగను కొనుగోలు చేసి అంతర్జాతీయ మార్కెట్‌కు ఎగుమతి చేస్తున్నారు.

 పికిలి రాము (వనపర్తి)