14-09-2025 12:31:56 AM
ఎముకలు కొరికే చలిలోనైనా, శరీరం కాలే ఎండలోనైనా, ఎడతెరిపి లేని వర్షంలోనైనా అతను చొక్కా లేకుండానే ఉంటాడు. చొక్కా అంటే అతనికి మహా చెడ్డ చిరాకు. చొక్కా వేసుకుంటే అదేదో జెర్రీలు పారుతున్నట్టు ఫీలవుతాడు. అందుకే ౪౦ ఏళ్లుగా అసలు చొక్కానే వేసుకోలేదు. ఎక్కడికి వెళ్లినా ఇతన్ని చూసి అందరు ఆశ్చర్యపోతారు. చొక్కా లేని వ్యక్తి జీవన విధానంపై చిన్న కథనం.
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామానికి చెందిన ముక్కెర బక్కయ్యకు చొక్కా వేసుకోవటం అంటే నచ్చదు. ఎందుకంటే చిన్నప్పుడు వాళ్ల తల్లిదండ్రులు బక్కన్నకు చొక్కా వేయలేదట. ఆర్థిక పరిస్థితులు ఓ కారణమైతే అదే అతనికి అలవాటుగా మారింది. ఊహ తెలిసిన నాటి నుంచి బక్కన్న చొక్క వేసుకోలేదు. ఎన్నోసార్లు అతని అన్న ప్రాధేయపడినా వినలేదు.
అదే సమయంలో బక్కన్నకు పెళ్లి కుదిరింది, పెళ్లి సమయంలో కూడా చొక్కా వేసుకోలేదు. వచ్చిన భార్య ఎంతగానో బతిమిలాడినా ఒప్పుకోలేదు. తనకు చొక్కా అంటే ఇష్టం ఉండదని,వేసుకుంటే ఉండలేనని చెప్పాడు. ఆమె ఎంత ప్రయత్నించినా బక్కన్నలో మార్పు రాలేదు. నేను కావాలంటే చొక్కవేసుకోవాలి లేకపోతే వెళ్లిపోతానని ఆమె హుకూం జారీ చేసింది. నువ్వు వెళ్లిన ఫర్వాలేదు కానీ నేను మాత్రం చొక్క వేసుకోనని తేల్చి చెప్పాడు.
దీంతో ఆమె అతని వదిలి వెళ్లిపోయింది. బక్కయ్య చొక్కా లేకుండానే అన్ని ప్రాంతాలకు వెళ్తాడు గతంలో వార్డు మెంబర్‌గా పని చేసినా బక్కయ్యకు మీటింగ్‌లు, ఇతర ఏ కార్యక్రమాలు ఉన్నా చొక్కా లేకుండానే వెళ్తాడు, చొక్కా శరీరంపై వేసుకుంటే తనకు చెమటలు వస్తాయని అందుకే 40 ఎళ్లుగా చొక్కా వేసుకోలేదని చెప్తున్నాడు. బక్కన్న చొక్కా లేకుండా తిరుగుతుంటే గ్రామస్తులు అతడిని గాంధీ అని పిలుస్తుంటారు. బక్కయ్యకు భార్యా పిల్లలు లేకపోవడంతో అన్న వద్ద ఉంటూ వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు.
కల్వకోట చంద్ర ప్రకాశ్, కోరుట్ల రూరల్